ఉత్తరాంద్ర అభివృద్ది చెందక మా గుండెలు రగిలిపోతున్నాయి: ఏపీ మంత్రి ధర్మాన

By narsimha lode  |  First Published Oct 12, 2022, 12:43 PM IST

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో తమ  ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తీసుకు వచ్చిందని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  చంద్రబాబు సర్కార్ రాజధానిపై ఏర్పాటు చేసిన కమిటీ  సిఫారసులను పట్టించుకోలేదన్నారు. 


అమరావతి: దేశంలోని  అన్ని ప్రాంతాల ప్రజలు  ప్రశాంతంగా నివసించే  పరిస్థితులు విశాఖపట్టణంలో మాత్రమే ఉన్నాయని  ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  బుధవారం నాడు ఆయన శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఇతర వర్గాల వారు అమరావతిలో నివసించే పరిస్థితులు లేవని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  ఆమోద యోగ్యం కాని నగరంలో రాజధాని ఏర్పాటు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు  మంత్రి. 

విజయవాడ, అమరావతిలో యాక్సెప్టబుల్ కల్చర్ లేదని మంత్రి తెలిపారు. ఇతరులను అక్కడికి  రానివ్వని వాతావరణాన్ని క్రియేట్ చేశారని మంత్రి ఆరోపించారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు. దీంతో అమరావతిలో  ఒక సాధారణ కుటుంబం ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. 

Latest Videos

undefined

ఉత్తరాంధ్ర అభివృద్ది చెందక ఇక్కడి ప్రజల గుండెలు మండిపోతున్నాయని ఏపీ మంత్రి ధర్మాన  ప్రసాదరావు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడుకూడా తమ ప్రాంతాన్ని దోచుకొనే కుట్రలు జరుగుతున్నాయన్నారు.అభివృద్ది చెందిన నగరాలేవీ కూడా ఆయా రాష్ట్రాలకు మధ్యలో లేవన్నారు. ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ది చెందితే మిగిలిన ప్రాంతాల్లో అభివృద్ది జరగదన్నారు. దీంతో గతంలో ఉద్యమాలు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొనైనా  పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని  మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 

 రాజధానిపై  ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ విషయమై ఇప్పటికైనా చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. కొన్ని వర్గాల అభివృద్ది కోసమే అమరావతి రాజధాని ప్రతిపాదన తెచ్చారని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ది కోసమే మూడు రాజధానులను తీసుకు వచ్చామని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  విశాఖ రాజధాని వద్దని  చంద్రబాబు చెప్పగలరా అని మంత్రి  ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.  

also read:ఉత్తరాంధ్ర బతుకులు మారడానికే మూడు రాజధానులు: అచ్చెన్నాయుడికి మంత్రి ధర్మాన కౌంటర్

ఉత్తరాంధ్రకు చంద్రబాబు నాయుడు ఏం చేశారని ఆయన అడిగారు. 2004 వరకు ఉత్తరాంధ్ర ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ప్రజా ప్రతినిధులు విజయం సాధించారన్నారు. కానీ ఇక్కడి ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేశాడన్నారు. వంశధార కోసం వైఎస్ఆర్ రూ. 1000 కోట్లు కేటాయించారని ఆయన గుర్తు చేశారు. 

click me!