
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని అన్నారు. విజయవాడలో ఈరోజు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలను మంత్రి బొత్స ప్రకటించారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని ఆరోపించారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఏ విధంగా జరిగాయో అంతా చూస్తున్నారని అన్నారు.
ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది అని విమర్శలు గుప్పించారు. ‘‘మన విధానం మనది, మన ఆలోచనలు మనవి’’ అని అన్నారు. విద్యా విధానానికి సంబంధించి భారతదేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని చెప్పారు.
ఇక, వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. పవన్ చేసిన ఆరోపణల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్ గాలి మాటలపై పొద్దున్నే తమకేందుకు ఈ రచ్చ అని ప్రశ్నించారు. పవన్ మాటలను పట్టించుకోకుంటేనే మంచిదని అన్నారు.
వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్భుద్దితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి బొత్స విమర్శించారు. పవన్ ఆడపిల్లలపై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థకు ఎంతో మంచి గుర్తింపు ఉందని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ విధివిధానాలు ఏమిటో పవన్ కల్యాణ్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగిందని వైసీపీ ఆరోపణలు చేసింది కదా అని ప్రశ్నించగా.. టీడీపీపై తాము గతంలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించామని అన్నారు.