వారం రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా, అంతా పబ్లిసిటీ కోసమే : చంద్రబాబుపై బొత్స

By Nagaraju penumalaFirst Published Aug 20, 2019, 4:01 PM IST
Highlights


వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారా? అని బొత్స నిలదీశారు. తమ ప్రభుత్వం ఎలాంటి దోపిడీ, అనవసరపు పబ్లిసిటీ లేకుండా వరద బాధితులని ఆదుకుందన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే మంత్రులు ఆ ప్రాంతంలో వెంటనే పర్యటించారనే ఉక్రోషంతో టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. 
 

విశాఖపట్నం: గోదావరి, కృష్ణా నదులకు వరదలు వచ్చి వారం గడుస్తుంటే ఇప్పుడు చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. గోదావరి, కృష్ణా వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయడంతో ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగామని స్పష్టం చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో చూపిన చొరవకు ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుందని తెలిపారు. వరద వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, వారికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు. 

వరదల నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే  ఊళ్లకు ఊర్లే కొట్టుకుపోయేవన్నారు. 

వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారా? అని బొత్స నిలదీశారు. తమ ప్రభుత్వం ఎలాంటి దోపిడీ, అనవసరపు పబ్లిసిటీ లేకుండా వరద బాధితులని ఆదుకుందన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే మంత్రులు ఆ ప్రాంతంలో వెంటనే పర్యటించారనే ఉక్రోషంతో టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. 

సంక్షోభవం వస్తే తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న చంద్రబాబు కుట్రను తమ ప్రభుత్వం చేధించిందన్నారు. సంక్షోభం నుంచి ప్రజలను గట్టెక్కించి ఆదుకోవాలన్న తపన తమ ప్రభుత్వానిదంటూ బొత్స చెప్పుకొచ్చారు. 

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం వరదలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఇప్పుడు పర్యటనలు అంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.  

అధికారంలో ఉంటే ఒకలా అధికారంలో లేకపోతే మరోలా మాట్లాడటం చంద్రబాబు అండ్ కోకు అలవాటుగా మారిందని విమర్శించారు. అలాంటి రాజకీయ నేతల వల్లే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోందంటూ దుయ్యబుట్టారు. 

ఇప్పటికైనా చంద్రబాబు బృందం అసత్యాలు చెప్పడం మానేసి ప్రభుత్వం చేసిన మంచి పనిని గుర్తించాలని సూచించారు. మరోవైపు విశాఖ పారిశ్రామిక సదస్సులో మీరు ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారో తెలియదా. ఒక్క పరిశ్రమ అయినా వైజాగ్‌కి వచ్చిందా అంటూ చంద్రబాబును నిలదీశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.  గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని చెప్పుకొచ్చారు. 

మరోవైపు చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరా విషయాన్ని వివాదం చెయ్యాల్సిన అవసరం లేదన్నారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు ముందుగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందనే అధికారులు డ్రోన్ కెమెరా ఉపయోగించారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. 

click me!