జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. సామాజిక న్యాయం గురించి చర్చకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: సామాజిక న్యాయం ఎవరితో సాధ్యం అయిందనే విషయమై చర్చకు సిద్దమా అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. ఆదివారంనాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ దృష్టిలో బీసీ అంటే బాబు క్లాస్ అని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. బిసి లపై పవన్ పెద్ద మాటలు చెబుతున్నారన్నారు.
పదేళ్ళలో బిసిల కోసం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అసలు అతని భావజాలం లోనే బిసి లు లేరన్నారు. బిసి లకు పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు చంద్రబాబు లు గత ఎన్నికల మ్యానిఫెస్టోలో 125 హామీలు ఇచ్చారన్నారు. ఈ హామీలు అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు బిసి లపై ప్రేమ, అభిమానం ఉంటే తన ఛాలెంజ్ ను స్వీకరించాలని ఆయన కోరారు. ఈ విషయమై జనసేన ఆవిర్భావ సభ రోజున చర్చిద్దామని మంత్రి జోగి రమేష్ చెప్పారు. ఏపీ లో జరిగిన సామాజిక న్యాయం చూసి అన్ని పార్టీ లు అదే బాటలో నడుస్తున్నాయన్నారు.
బిసి ల కు డిక్లరేషన్ చెయ్యాలంటే 175 స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్నారు. చంద్రబాబుకు అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ బిసి ల డిక్లరేషన్ ఎలా చేస్తాడని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు.