విశాఖలో ఎందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు, పవన్ కళ్యాన్ ను నిలదీశారు అనిల్ కుమార్ యాదవ్. కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హితవు పలికారు.
తాడేపల్లి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు నాయుడు పాలనలో కొన్నికోట్ల మేర ఇసుక దందా నడిచిందని ఆనాడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
నవంబర్ 3న పవన్ కళ్యాణ్ చేపట్టబోయే లాంగ్ మార్చ్ పై సెటైర్లు వేశారు. పవన్ చేస్తోంది లాంగ్ మార్చా?... రాంగ్ మార్చా? అంటూ ప్రశ్నించారు. ఉనికి కోసమే పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏ ప్రభుత్వం అయినా ఇసుకను దోచుకుంటుందా? అయిదేళ్లుగా ఎవరు ఇసుక మాఫియా చేశారో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు చంద్రబాబుకు 23 సీట్టిచ్చారని తిట్టిపోశారు.
ఏ రోజూ చంద్రబాబును పవన్ ప్రశ్నించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆనాడు చంద్రబాబుతో పవన్ కుమ్మక్కు అయ్యారు కాబట్టే నోరు మెదపలేదన్నారు. విశాఖలో ఎందుకు లాంగ్ మార్చ్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు, పవన్ కళ్యాన్ ను నిలదీశారు అనిల్ కుమార్ యాదవ్.
కృష్ణా, గోదావరి, వంశధార ఒడ్డున చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హితవు పలికారు. రాష్ట్రంలో రైతులతో సహా అంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. వారం, పదిరోజుల్లో ఇసుక కొరత తీరుస్తామని హామీ ఇచ్చారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పవన్ లాంగ్ మార్చ్ అంటున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో ఎక్కడైనా ఒక్క ఇసుక లారీని సీజ్ చేశారా? ప్రభుత్వ పాలన పారద్శకంగా నడస్తుంటే ఓర్వలేక లాంగ్ మార్చ్ లు అంటున్నారంటూ మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీకీ అనుబంధ పార్టీగా జనసేన వ్యవహరిస్తోందని ఆరోపించారు. నదులు నిండా నీరే ఉందన్న విషయం పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా అని నిలదీశారు. ఇసుక పేరుతో చంద్రబాబు, పవన్ దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.
గత అయిదేళ్లు ఇసుక మాఫియా చేసిన దారుణాలపై ఎందుకు ప్రశ్నించలేదని పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలని సూచించారు. సమస్య ఉంటే ముఖ్యమంత్రి వద్దకు వచ్చి చెప్పాలని సూచించారు.
మరోవైపు చంద్రబాబు నాయుడుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిందన్నారు. చంద్రబాబు పాలన అంతా కరువేనని చెప్పుకొచ్చారు.
వరద కారణంగానే రాష్ట్రంలో ఇసుక కొరత ఉందని స్పష్టం చేశారు. ఎక్కడా ఇసుక మాఫియా జరగకూడదని సీఎం జగన్ ఆదేశించారన్నారు. వరదలు తగ్గగానే ఇసుక కావాల్సినంతగా అందుబాటులోకి వస్తుందన్నారు.
చంద్రబాబుకు వయసు మందగించి, అధికారం కోల్పోయి బాధ, వ్యధతో ఆందోళనలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. మళ్లీ నన్నే రమ్మంటున్నారు అని చంద్రబాబు అంటుంటే రైతులు భయపడిపోతున్నారని స్పష్టం చేశారు.
కొడుకును కొంగుచాటు బిడ్డలా కాపాడుకుంటూ దత్త పుత‍్రుడితో లాంగ్ మార్చ్ అంటున్నారని విమర్శించారు. చంద్రబాబుతో స్నేహం చేస్తే జనసేనకు వచ్చే ఎన్నికలు కూడా కష్టమేనని ఇకనైనా పవన్ కళ్యాణ్ సొంతంగా రాజకీయాలు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ లాంగ్ మార్చ్: వైసీపీ ఎత్తులు, ఎలక్షన్ సీన్ రిపీట్
పవన్ లాంగ్ మార్చ్ కు లెఫ్ట్ డుమ్మా: పాల్గొనేది లేదని తేల్చేసిన నేతలు