రాస్కో చూస్కో అన్నారు, ఇప్పుడేమంటారు : బాబును నిలదీసిన మంత్రి అనిల్

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 11:37 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వైయస్ జగన్మోహన్ రెడ్డితో ప్రారంభించాలన్నది భగవంతుడి సంకల్పమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బాటలు వేసింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఇప్పుడు ఆయన తనయుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తారంటూ చెప్పుకొచ్చారు. 

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషదాయకమన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది వైయస్ జగన్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వైయస్ జగన్మోహన్ రెడ్డితో ప్రారంభించాలన్నది భగవంతుడి సంకల్పమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బాటలు వేసింది దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఇప్పుడు ఆయన తనయుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభిస్తారంటూ చెప్పుకొచ్చారు. 

తమ ప్రభుత్వం చెప్పినట్లే నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద మెఘా కంపెనీ ప్రతినిధులు పూజలు నిర్వహించారని ఇక పనులు ప్రారంభించడమే తరువాయన్నారు. 

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలు నానా హంగామా చేశాయని మండిపడ్డారు. పోలవరం రివర్స్ టెండరింగ్ కాదు అంతా రివర్స్ అంటూ చేసిన విమర్శలకు ఇప్పుడు సరైన సమాధానం కోర్టు ఇచ్చిందన్నారు. 

రివర్స్ టెండరింగ్ కు వెళ్లకపోతే రూ. 800 కోట్లు ఆదా అయ్యేదా అన్నారు. ఆ 800 కోట్ల రూపాయలు పెదబాబా, చినబాబు ఇంకోబాబా ఎవరి చేతుల్లోకి వెళ్లేవో ప్రజలే అర్థం చేసుకోవాలని అన్నారు. రివర్స్ టెండరింగ్ ను న్యాయస్థానాలు సైతం స్వాగతించాయన్నారు. 

నవయుగ  కంపెనీ వేసిన పిల్ ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు హై కోర్టు తీర్పు తప్పంటారేమోనంటూ సెటైర్లు వేశారు. తాము చెప్పినట్లుగానే నవంబర్ ఫస్ట్ నుంచి పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. అలాగే అనుకున్న సమయానికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టును పూర్తి చేస్తారని తెలిపారు. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ నేతలు, గత ఇరిగేషన్ శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా రాస్కో, పూస్కో అంటూ నానా మాటలు అన్నారని గుర్తు చేశారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని హంగామా చేసి 2019 వరకు కూడా స్పిల్ వే పెట్టలేకపోయారన్నారు.  

పోలవరం తామే పూర్తి చేశామని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఎక్కడ పూర్తి చేసిందని ప్రశ్నించారు. మాట్లాడితే 70శాతం పనులు పూర్తి చేశామని చెప్తున్న చంద్రబాబు రూ.30వేల కోట్లు పనులు ఇంకా మిగిలే ఉన్నాయని వాటికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు తెలుగుదేశం ప్రభుత్వం నిద్రపోయిందా అంటూ నిలదీశారు. మెుదటి మూడేళ్లు పట్టించుకోకుండా చివరి రెండు సంవత్సరాలు నానా హంగామా చేయడం వెనుక ఉద్దేశం ఏంటని మంత్రి అనిల్ కుమార్ నిలదీశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పోలవరంపై హైకోర్టు తీర్పు... ఇరిగేషన్ మంత్రి ఏమన్నారంటే

click me!