మంత్రి పదవికి రాజీనామా చేస్తా: అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Nov 1, 2019, 11:10 AM IST
Highlights

గత ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి చెందిన వెంటనే నియోజకవర్గాన్ని మరచిపోయారన్నారు. ఎన్నికలు అయిన తర్వాత గాజువాకను పట్టించుకున్నారా అంటూ నిలదీశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం గెలుపొందినప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదన్నారు. 

విశాఖపట్నం: నిత్యం వార్తల్లో నిలుస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇసుక కొరత అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న తరుణంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 

ఇసుక అక్రమాలపై మీడియాతో మాట్లాడిన అవంతి శ్రీనివాస్ తెలుగుదేశం, జనసేన పార్లీలపై విరుచుకుపడ్డారు. ఇసుక అక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకుల హస్తం ఉందని నిరూపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

గతంలో ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన చంద్రబాబు అదే నాయకులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని పేరిట సింగపూర్‌ కంపెనీకి కోట్ల విలువైన భూమి ధారాదత్తం చేశారంటూ మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశాలనే జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా లేవనెత్తుతున్నారని ఆరోపించారు. ఉదయం చంద్రబాబు ప్రశ్నిస్తే సాయంత్రం పవన్ కళ్యాణ్ అదే అంశంపై మాట్లాడుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. చంద్రబాబుపై అభిమానం ఉంటే పార్టీని టీడీపీలోకి విలీనం చేసుకోవాలని హితవు పలికారు. అంతేకానీ టీడీపీ ఆరోపించింది కదా అని మీరు కూడా విమర్శలు చేయడం భావ్యం కాదన్నారు. 

రాష్ట్రంలో ఇసుక సమస్యను అధిగమిస్తామని అవంతి శ్రీనివాస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేసినా లైఫ్ లాంగ్ మార్చ్ చేసినా ఎలాంటి ఉపయోగం లేదంటూ సెటైర్లు వేశారు. 
గత ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా నియోజకవర్గాలను వదిలిపెట్టలేదని ప్రజలకు అందుబాటులోనే ఉంటూ ప్రజా సేవ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 

గత ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి చెందిన వెంటనే నియోజకవర్గాన్ని మరచిపోయారన్నారు. ఎన్నికలు అయిన తర్వాత గాజువాకను పట్టించుకున్నారా అంటూ నిలదీశారు.  

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం గెలుపొందినప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం లేదన్నారు. ఇటీవలే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మళ్లీ అదృశ్యమయ్యారంటూ మంత్రి అవంతి శ్రీనివాసరావు విమర్శించారు. 

ఇకపోతే గత కొద్దిరోజులుగా మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్, గంటా శ్రీనివాస్ లే టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇసుకకొరతను నిరసిస్తూ విశాఖలో పవన్ కళ్యాణ్ నవంబర్ 3న లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు పిలుపు ఇచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్కటేనంటూ ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ కూడా ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

నాడు ఎన్టీఆర్-నేడు జగన్, చరిత్ర తెలుసుకోండి: పవన్ పై మంత్రి అవంతి మండిపాటు

జగన్ కన్నెర్రజేస్తే మీ పదవి ఔట్: చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్ ఫైర్

click me!