పులిచింతల ప్రాజెక్టు వద్ద విరిగిపోయిన గేటును మంత్రి అనిల్ కుమార్ గురువారం నాడు పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు యుద్దప్రాతిపదికన గేటును బిగించాలని మంత్రి ఆదేశించారు.పోలవరం నుండి నిపుణులను పులిచింతలకు రప్పిస్తున్నారు.
జగ్గయ్యపేట: పులిచింతల ప్రాజెక్టు వద్ద విరిగిపోయిన 16వ గేటు ప్రాంతాన్ని ఏపీ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ గురువారం నాడు ఉదయం పరిశీలించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఈ క్రమంలోనే 16వ గేటు విరిగిపోయింది. రెండు అడుగుల మేర గేటును ఎత్తే సమయంలో గేటు విరిగిపోయింది. దీంతో పులిచింతల ప్రాజెక్టు నుండి 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. పులిచింతల నుండి దిగువకు భారీగా వరద నీరు వస్తున్ననేపథ్యంలో నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
also read:విరిగిపడిన పులిచింతల ప్రాజెక్టు గేట్: దిగువ గ్రామాల ప్రజలకు హెచ్చరిక
పులిచింతల ప్రాజెక్టుకు అత్యవసరంగా గేటు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పోలవరం నుండి నిపుణులైన ఇంజనీర్లను పులిచింతల ప్రాజెక్టు వద్దకు రప్పిస్తున్నారు. ప్రాజెక్టుకు గేటు బిగించకపోతే నీరంతా వృధాగా సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది. దీంతో యుద్దప్రాతిపదికన ప్రాజెక్టుకు గేటు బిగించాల్సిన అవివార్య పరిస్థితులు నెలకొన్నాయి.గేటు ఎందుకు విరిగిపోయిందనే విషయమై అధికారులు ఆరా తీఃస్తున్నారు. నిర్వహణ సరిగా లేని కారణంగా జరిగిందా... గేటు పాడైందా , వరదతో గేటు విరిగిందా అనే విషయమై నిపుణులు నిర్ధారించనున్నారు.ప్రాజెక్టుకు గేటు బిగించే విషయమై మంత్రి అనిల్ అధికారులతో చర్చించారు.