
అమరావతి: మూడు రాజధానులపై తాము తీసుకొన్న నిర్ణయం తప్పని నమ్మితే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే ప్రజలే నిర్ణయిస్తారని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబుకు సవాల్ విసిరారు.
సోమవారంనాడు మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.రాష్ట్రం మొత్తం జగన్ తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు హర్షిస్తున్నారని చెప్పారు.ఈ నిర్ణయంపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయాలని ఆయన ప్రశ్నించారు.
also read:పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం: హైకోర్టులో మూడు పిటిషన్లు
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై 2024లో ప్రజల తీర్పును కోరుతామని ఆయన చెప్పారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం తప్పని నమ్ముతున్న చంద్రబాబుకు దమ్ముంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్ గురించి ఎంత మాట్లాడినా వేస్టేనని ఆయన చెప్పారు. ఆయన ఇంకా గందరగోళంలోనే ఉన్నాడన్నారు బీజేపీతో పొత్తు అంటూనే. చంద్రబాబునాయుడుకు పవన్ మద్దతుగా మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ మాటలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.
చంద్రబాబుకు సంబంధించిన వారి భూముల చుట్టూ రాజధానిని కేంద్రీకరించారని ఆయన ఆరోపించారు.అమరావతిని రియల్ ఏస్టేట్ దందాకు చంద్రబాబునాయుడు వాడుకొన్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో మంచి రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నించలేదని ఆయన విమర్శించారు. టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో రాజధానిని ప్రకటించారని ఆయన విమర్శించారు.
అమరావతిలో శాసనసభ రాజధాని కొనసాగుతోందన్నారు. దీనికి అదనంగా మరో రెండు చోట్ల రాజధానులు ఉంటాయని ఆయన వివరించారు.
అమరావతికి అదనంగా మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పరిస్థితి రియల్ ఏస్టేట్ మాఫియాకు బాధగా ఉందని ఆయన విమర్శించారు.
అన్ని ప్రాంతాలకు సంస్థలు, కార్యాలయాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతిలోనే జగన్ స్వంత ఇల్లు కట్టుకొన్నారన్నారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో అద్దాల మేడ కట్టుకొన్నారన్నారు. రాజధానిపై ప్రేమ ఎవరికి ఉందో దీన్ని బట్టి అర్ధమౌతోందన్నారు.