వెంకట్రామిరెడ్డిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్: డీజీపీకి లేఖ

By telugu teamFirst Published Jan 23, 2021, 6:25 PM IST
Highlights

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన డీజీపీకి లేఖ రాశారు.

అమరావతి: తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఉద్యోగల సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డిపై ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సీరియస్ అయ్యారు. వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆయన డిజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి చేసిన ప్రకటనను ఉటంకిస్తూ ఆయన ఆ లేఖ రాశారు. 

వెంకట్రామిరెడ్డి తీవ్రంగా రెచ్చగొట్టే విధంగా, అవాంఛనీయంగా మాట్లాడారని ఆయన అన్నారు. వ్యక్తిగత స్థాయిలో ఎన్నికల కమిషనర్ కు డెత్ త్రెట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. వెంకట్రామిరెడ్డి చర్యలపై నిఘా పెట్టాలని, కమిషనర్ మీద భౌతిక దాడికి పాల్పడే అవకాశం ఉందా అనేది పరిశీలించాలని ఆయన అన్నారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, వాక్యిన్ ఇచ్చేంత వరకు తాము విధుల్లో పాల్గొనబోమని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ప్రాణాపాయం వస్తే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం కల్పించందని, ఇది అంతకన్నా పెద్దదా అని అన్నారు. 

సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. తాము ఎన్నికలు వద్దని అనడం లేదని, తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే రక్షణ కల్పించాలని కోరుతున్నామని, తమ ప్రాణాలను రక్షించుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అందువల్ల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, అది తీసుకున్న తర్వాతనే ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. 

తమ ప్రాణాలకు రక్షణ లేదని ఉద్యోగులు అంటున్నారని, భయం ఉంది కాబట్టి విధులకు దూరంగా ఉండాలనుకునేవారికి ఆ అవకాశం ఇవ్వాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చేవారితో నిర్వించుకోవాలని, ప్రాణభయంతో ఉన్నవారు దూరంగా ఉంటామంటే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నిారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఏ విధంగానైనా ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారని, చర్చించి నిర్ణయం తీసుకోవడమంటే కాఫీ తాగి వెళ్లడం కాదని, 13వ తేదీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం అంటోందని ఆయన అన్నారు. ఓ వైపు ఉద్యోగులను డిస్మిస్ చేస్తూ మరో వైపు సిబ్బంది లేదని నిమ్మగడ్డ అంటున్నారని ఆయన అన్నారు.

click me!