మందుబాబులకు బ్యాడ్ న్యూస్... మద్యం ధరలు పెంచాలని జగన్ సర్కార్ కు వినతి

By Arun Kumar PFirst Published Jun 29, 2022, 5:18 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని మద్యం ధరలు పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 

విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ లభిస్తున్న పలు మద్యంబ్రాండ్లలో విషపూరిత రసాయనాల, మోతాదుకు మించి రసాయనాలు వాడుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి మద్యం తాగడం వల్ల మతిభ్రమించడం, నరాలు లాగేయడం, మెదడుతో పాటు నరాల్లో సూదులు గుచ్చినట్లు ఇలా వింత రోగాల భారినపడే అవకాశాలున్నాయని టిడిపి నాయకులు ఇటీవల ఆరోపించారు. ఈ ప్రచారంపై లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. 

పక్కనే వున్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం తక్కువ ధరకే మద్యం ఇస్తుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఇప్పుడు ఇస్తున్న ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని... మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. 2017 నుండి తమకు మద్యం అమ్మకాలపై సరయిన లాభాలు లేవని...  ధరలు తక్కువగా వుండటమే అందుకు కారణమన్నారు.  

ఇక ఏపీలో మద్యం సరఫరా చేసే డిస్టిలరీలను ఎంతో క్వాలిటీగా మెయింటెన్ చేస్తున్నామని... ఇందులో తయారయ్యే మద్యం క్వాలిటీగానే వుంటుందన్నారు. డిస్టిలరీపై ఎలాంటి అనుమానాలున్నా తమకు సంప్రదించవచ్చని ప్రజలకు సూచించారు. కానీ బయట జరిగే ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అసోసియేషన్ ప్రతినిధులు సూచించారు. 

ఒక్కో మద్యం కంపనీ నుండి నాలుగైదు బ్రాండ్ లు మార్కెట్లోకి వస్తుంటాయని... ఇలా ఏపీలో 184 బ్రాండ్ల అమ్మకానికి అనుమతి వుందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వీటిపైనే రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది ఆదారాపడి జీవిస్తున్నారని అన్నారు. అలాంటిది మద్యంపై దుష్ప్రచారం తగదని... ఏవయినా అనుమానాలు వుంటే డిస్టిలరీలను పరిశీలించవచ్చని లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ స్పష్టం చేసింది. 

కొన్ని బ్రాండ్లలో విషపూరితమైన పదార్ధాలు వాడుతున్నట్లు ప్రచారం జరుగుతోందని... ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. హాని కలిగించే రసాయనాలను ఏ బ్రాండ్ లోనూ వాడటం లేదన్నారు. టిడిపి వాళ్లు ఆరోపణలు చేసిన విధంగా ఏ మద్యం బ్రాండ్ లోనూ విషపదార్థాలు లేవని స్పష్టం చేసారు. 

డిస్టిలరీల్లో తయారయ్యే మద్యాన్ని కేవలం విమ్టా ల్యాబ్ వాళ్లు మాత్రమే పరిశీలించి సర్టి ఫై చేస్తారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కాబట్టి ఎలాంటి విషపదార్థాలు మద్యంలో వున్నా వీరు తిరస్కరిస్తారన్నారు. ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చాకే మద్యం సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల రవాణా తాత్కాలికంగా నిలిచిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 

మూడు దశాబ్దాలుగా ఒక పద్దతి ప్రకారమే లిక్కర్ తయారి, సరపరా తదితర ప్రక్రియ నడుస్తుందన్నారు. క్వాలిటీ లిక్కర్ నే తాము అందిస్తున్నామని... ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు  ఉంటే సరి చేసుకుంటామన్నారు. ప్రజల ప్రాణాలతో ముడి పడి ఉన్న వ్యాపారం ఇది కాబట్టి తయారీ నుంచి రవాణా వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 

వినియోదారుల డిమాండ్ ను బట్టి మద్యం బ్రాండ్ ల సరఫరా ఉంటుందని... ప్రముఖ బ్రాండ్ లు ధర నచ్చకపోతే సరఫరా నిలిపివేస్తుంటారన్నారు. ఏయే బ్రాండ్ లు పెట్టాలనేది చేసుకున్న ఒప్పందాలను బట్టి ఉంటుందని లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. 

click me!