పవన్ కళ్యాణ్ కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులు స్వయంగా లేఖలు రాశారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. లాంగ్ మార్చ్ కి తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరం కావాల్సి వస్తుందని తెలిపారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లెఫ్ట్ పార్టీలు షాక్ ఇచ్చాయి. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ నేతృత్వంలో నవంబర్ 3న విశాఖపట్నం వేదికగా జరగబోతున్న లాంగ్ మార్చ్ కు హాజరుకాబోమని స్పష్టం చేశాయి.
ఇకపోతే లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా వామపక్ష పార్టీల నేతలకు ఫోన్ చేశారు. సీపీఎ రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలకు స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు.
ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వారి పక్షాన పోరాడతామని అందుకు అంతా సహకరించాలని కోరారు. అయితే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఫోన్ లో పవన్ కళ్యాణ్ కు తెలిపారు.
ఈ నేపథ్యంలో శనివారం పవన్ కళ్యాణ్ కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి మధులు స్వయంగా లేఖలు రాశారు. లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. లాంగ్ మార్చ్ కి తమతోపాటు బీజేపీని కూడా ఆహ్వానించడంతో తాము దూరం కావాల్సి వస్తుందని తెలిపారు.
ఇకపోతే పవన్ లాంగ్ మార్చ్ ఆహ్వానంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. తొలుత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ వేదికను తాము పంచుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సైతం పవన్ తో వేదికను పంచుకోబోమని తెలిపారు.
అయితే శుక్రవారం కన్నా లక్ష్మీనారాయణ మాట మార్చారు. పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు బీజేపీ సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. అయితే విష్ణువర్థన్ రెడ్డి మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో బీజేపీ గందరగోళంలో పడింది.
ఇకపోతే ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ మాత్రమే బహిరంగంగా మద్దతు తెలిపింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు మద్దతు పలికారు. పార్టీ తరపున సీనియర్ నేతలు పాల్గొంటారని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్ లో ఏఎలాంటి పిలుపు ఇచ్చినా తాము మద్దతు ఇస్తామంటూ చంద్రబాబు స్నేహ హస్తం అందించారు.