ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసింది. కరోనా కారణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.
అమరావతి: ఏపీలో ఇంటర్ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం నాడు విడుదల చేశారు.ఇవాళ అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.పరీక్షలు రద్దు చేయడంతో ఇంటర్ విద్యార్థులందరినీ కూడ ఉత్తీర్ణులు చేశామన్నారు. టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల్లో 30 శాతం, ఇంటర్ ఫస్టియర్ లో వచ్చిన మార్కుల్లో 70 శాతం మార్కులను కలుపుకొని సెకండియర్ లో మార్కులను కేటాయించామని ఆయన చెప్పారు.
ఈ నెల 31వ తేదీ లోపుగా ఫలితాలు ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అయితే వారం రోజుల ముందే ఫలితాలను విడుదల చేస్తున్నామన్నారు మంత్రి.ఇంటర్ ఫస్టియర్ ఫీజులు చెల్లించిన వారంతా ఉత్తీర్ణులైనట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఫస్టియర్ విద్యార్థులను సెకండియర్ కు ప్రమోట్ చేసినట్టుగా తెలిపారు.
ఫస్టియర్ లో ఫెయిలైన విద్యార్థులకు పాస్ మార్కులు కేటాయించి ఉత్తీర్ణులు చేశామన్నారు.ఫలితాలు నచ్చని విద్యార్థులకు పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. ఫలితాలను results.bie.ap.gov.in, results.apcfss.in వెబ్ సైట్లలో మార్కులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 5.10 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించిన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి.కరోనాతో థియరీ పరీక్షలు నిర్వహించలేదని మంత్రి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ప్రాక్టికల్స్ మార్కుల ఆధారంగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులు కేటాయించింది ప్రభుత్వం.