
మద్యం మత్తులో రేపల్లెలో మహిళపై నిందితులు అత్యాచారానికి (repalle railway station gang rape) పాల్పడ్డారని ఏపీ హోంమంత్రి తానేటి వనిత (taneti vanitha) స్పష్టం చేశారు. నిందితులు బాధితురాలి భర్త వద్ద దొంగతనం చేసేందుకు యత్నించారని.. మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారని హోంమంత్రి చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ ఉనికిని కాపుడుకునేందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వేస్టేషన్లలో భద్రతను పెంచుతామని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తానేటి వనిత చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల కొరత ఉందని.. దీనిపై త్వరలోనే మఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చించి.. సమస్యను పరిష్కరిస్తామని హోంమంత్రి చెప్పారు .
ఇక ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్‌పై (ys jagan) మరోసారి భక్తిని చాటుకున్నారు తానేటి వనిత. మరో 25 ఏళ్లు పాటు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉండేలా అందరూ ప్రార్థన చేయాలని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ సీఎం కావాలని అందరూ ప్రార్థన చేశారని ఆమె గుర్తుచేశారు. పాదయాత్రలో పేదల బాధలు చూసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని.. కులం, మతం, పార్టీలు భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని తానేటి వనిత వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలు మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పరిపాలన రాబోయే తరాలకు అందాలంటే జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే సరైన నిర్ణయమని తానేటి వనతి చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో గౌరవంగా.. విలువలతో మాట్లాడామని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డిని ఎలా ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసనంటూ వ్యాఖ్యానించారు. ఇక ‘‘ గడప గడపకు వైసీపీ’’ (gadapa gadapaku ycp) కార్యక్రమం వాయిదా వేయడంపైనా హోంమంత్రి క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమం వాయిదా వేయడానికి.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందిస్తోందని.. ఆందోళనలకు భయపడాల్సిన అవసరం లేదని తానేటి వనిత పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్‌ను భయపెట్టేవారేలేరని... సంక్షేమ పథకాలపై ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారం సిద్ధం కాలేదని అందుకే గడప గడపకు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తానేటి వనిత చెప్పారు.