ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు: చంద్రబాబుపై సుచరిత వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 21, 2020, 6:22 PM IST
Highlights

ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను గుర్తించే స్థితిలో చంద్రబాబు లేరని ఎద్దేవా చేశారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత

ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను గుర్తించే స్థితిలో చంద్రబాబు లేరని ఎద్దేవా చేశారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. అమరావతిలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్లపట్టాల పంపిణీని కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారని సుచరిత ధ్వజమెత్తారు.

ఇంగ్లీష్ మీడియంను, ఎస్ఈసీగా దళితుణ్ని నియమిస్తే అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. 125 అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చేస్తే దీనిపైనా విమర్శలు చేస్తున్నారని సుచరిత ఫైరయ్యారు.

దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికి చంద్రబాబు క్షమాపణలు చెప్పలేదని ఆమె వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసినా దళితుడైన వర్ల రామయ్యను చంద్రబాబు బలిచేశారని మండిపడ్డారు.

జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో 82 శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించిందని సుచరిత గుర్తుచేశారు. భారతదేశంలో దళిత మహిళను హోంమంత్రిని ఎక్కడా చేయలేదని.. తనకు జగన్ ఆ గౌరవం కల్పించారని ఆమె చెప్పారు.

సామాజిక న్యాయాన్ని జగన్ చేసి చూపించారని సుచరిత తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని.. జగనన్న గోరు ముద్ద ద్వారా ప్రయోజనం పొందుతున్నారని ఆమె వెల్లడించారు.

మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇప్పటి వరకు 5.80 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని.. 71,700 ఫిర్యాదులు వచ్చాయని.. 53 వేల మందికిపైగా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని సుచరిత తెలిపారు.

మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించచేందుకే దిశ చట్టం  చేశామని.. చట్టం అమల్లోకి వచ్చాక మహిళలపై ఆఘాయిత్యాలు తగ్గాయని హోంమంత్రి పేర్కొన్నారు. దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామని.. మహిళలకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

click me!