
గుంటూరు: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో బీజేపీ(BJP) నేతల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే రూ. 75లకే చీప్ లిక్కర్(Cheap Liquor) ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ తర్వాతే గుంటూరులోని జిన్నా టవర్(Jinnah Tower) పేరు మార్చాలని, లేదంటే తాము కూల్చేస్తామని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీరును అధికార వైసీపీ నేతలు ఎండగడుతున్నారు. తాజాగా, రాష్ట్ర హోం మంత్రి సుచరిత(Home Minister Sucharitha) బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తే అడ్డుకుంటామని అన్నారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలని అనుకోవడం తప్పని హితవు పలికారు. మన దేశం.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అన్నారు. అందరూ సామరస్యంగా కలిసి ఉండాలని, దానికి విఘాతం కలిగించరాదని చెప్పారు. నిజంగా జిన్నా ఏం నష్టం చేశాడో? ఏం మేలు చేకూర్చాడో.. ఈ జిన్నా టవర్ ద్వారా ప్రజలు తెలుసుకోవడానికి, ఆలోచించడానికి ఆస్కారం ఉందని ఆమె అన్నారు.
పురాతన కట్టడాలను కూల్చాలనుకోవడం తప్పు అని హోం మినిస్టర్ సుచరిత అన్నారు. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన చిహ్నాలను తొలగించాలనుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇది వరకే నిర్మించి ఉన్న టవర్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టడం కాదు.. అవసరమైతే.. అబ్దుల్ కలాం పేరుతోనే కొత్త నిర్మాణాలు చేయండని సూచించారు. అంతేకానీ, ఉన్న నిర్మాణాలు తొలగించవద్దని అన్నారు. అబ్దుల్ కలాంతోపాటు ఇంకా చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని, వారి మీద నిజంగా ప్రేమ ఉంటే.. వారి పేరు మీద నిర్మాణాలు చేయండి అని సూచించారు.
Also Read: గుంటూరులో జిన్నాసెంటర్‌పై బీజేపీ నేత సత్యకుమార్ ట్వీట్: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
చీప్ లిక్కర్ వ్యాఖ్యల తర్వాత జిన్నా టవర్ చుట్టూ రాజకీయం రసవత్తరమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీపై వైసీపీ ధ్వజం ఎత్తుతున్నది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బీజేపీపై విమర్శలు సంధించారు. సోము వీర్రాజు మాట్లాడిన ‘సారా మాటల’ను డైవర్ట్ చేయడానికే బీజేపీ చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు. ఆ మాటలను మరుగపరచడానికే జిన్నా టవర్ అంశాన్ని తెర మీదకు తెచ్చిందని ఆరోపించారు.
గుంటూరులో జిన్నా టవర్‌ను దేశ స్వాతంత్ర్యం రాకముందే నిర్మించారని వైసీపీ లీడర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. దాన్ని ఇప్పుడు అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని, ఇది ఆ పార్టీ సంస్కృతిని తేటతెల్లం చేస్తున్నదని విమర్శించారు. జీవీఎల్ నుంచి విష్ణు వరకు ఆ పార్టీ నేతలందరికీ సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్ ఎందుకు గుర్తుకు వచ్చింది? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేదంటే తాము కూల్చివేస్తామని బీజేపీ నేతలు మూకుమ్మడిగా విద్వేషం చిమ్మడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిగ్గు లేని చీప్ లిక్కర్ మాటలు మాట్లాడిందేగాక.. డైవర్షన్ రాజకీయాలూ చేస్తున్నదని మండిపడ్డారు.
Also Read: తాజ్ మహాల్ ను కూడా తీసివేయమంటారా? బీజేపీపై V Hanumantha Rao ఫైర్
గుంటూరులోని జిన్నా టవర్‌కు జాషువా, అబ్దుల్ కలాం పేర్లు పెట్టవచ్చు అని బీజేపీ నేత సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అన్నారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతల వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసమేనని ఆరోపించారు. అన్ని కులాలు, మతాల వారు సామరస్యంగా మెలుగుతున్న తరుణంలో విద్వేషాలు సృష్టించేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.