తోలు తీయించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు: పవన్‌పై ఏపీ హోంమంత్రి ఫైర్

By Siva KodatiFirst Published Sep 30, 2021, 2:55 PM IST
Highlights

పవన్ కల్యాణ్ తోలు తీస్తానని హెచ్చరిస్తున్నాడని, ఇక్కెడవరూ తోలు తీయించుకోవడానికి సిద్ధంగా లేరంటూ ఏపీ హోంమంత్రి చురకలు వేశారు. నిలకడలేని పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెలియదని సుచరిత విమర్శించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సీఎం జగన్ పైనా, ఏపీ ప్రభుత్వంపైనా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత పవన్ పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తానని హెచ్చరిస్తున్నాడని, ఇక్కెడవరూ తోలు తీయించుకోవడానికి సిద్ధంగా లేరంటూ చురకలు వేశారు. నిలకడలేని పవన్ కల్యాణ్ ఎప్పుడు, ఎక్కడ ఉంటాడో తెలియదని సుచరిత విమర్శించారు.

గత ఎన్నికల్లో రెండు చోట్ల నిలబడితే, రెండు చోట్లా ప్రజలు ఓడించారని, మరి వచ్చే ఎన్నికల్లో ఇంకెన్ని చోట్ల నిలబడతారో, అసలాయనను ప్రజలు అంగీకరిస్తారో లేదో అంటూ సెటైర్లు వేశారు. ఓసారి తాను లెఫ్టిస్టునంటాడు... ఆ తర్వాత బీజేపీతో భాగస్వామినంటాడు... మరోసారి టీడీపీతో వెళతానంటాడు... పవన్ కల్యాణ్ ఎలాంటి వాడన్నది ప్రజలకు సంపూర్ణంగా స్పష్టమైందని హోంమంత్రి దుయ్యబట్టారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో ఎంపీపీ పదవులు పంచుకున్న అనంతరం జనసేన, టీడీపీ మైత్రి బట్టబయలైందని సుచరిత ఆరోపించారు.

ALso Read:మంత్రి పేర్ని నాని కాన్వాయ్ ని అడ్డగించిన జనసేన : తణుకులో ఉద్రిక్తత, క్షమాపణకు డిమాండ్

అటు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ సైతం పవన్‌పై మండిపడ్డారు. ఇవాళ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనానిని విమర్శించారు. పవన్ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కు తెలిసిందల్లా ప్రభుత్వంపై బురదచల్లడం ఒక్కటేనని అన్నారు. రాష్ట్రంలో రుతుపవనాల సీజన్ ముగిశాక రోడ్ల మరమ్మతు పనులు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తారు. పవన్‌కు రెండు నియోజకవర్గాల్లో ప్రజలు తాటతీసినా ఆయన బలుపు తగ్గలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అంటే ఏంటో సీఎం జగన్ ను చూసి నేర్చుకోవాలని పవన్ కు దొరబాబు హితవు పలికారు

click me!