సీఎం సొంత జిల్లాలో... గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

Arun Kumar P   | Asianet News
Published : Jan 29, 2021, 12:35 PM ISTUpdated : Jan 29, 2021, 12:45 PM IST
సీఎం సొంత జిల్లాలో... గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

సారాంశం

గతంలో చేపట్టిన పంచాయతీల విభజన, నగర పంచాయతీలో విలీనం తదితర అంశాలపై కడప జిల్లాలోని 13 గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైన సమయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 13 గ్రామ పంచాయతీల ఎన్నికలకు బ్రేక్ పడింది.

గతంలో చేపట్టిన పంచాయతీల విభజన, నగర పంచాయతీలో విలీనం తదితర అంశాలపై కడప జిల్లాలోని 13 గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలపై స్టే విధించింది. దీంతో 13గ్రామాలు ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికలకు దూరమయ్యాయి. 

కడప జిల్లా సంబేపల్లె మండలంలో మూడు పంచాయతీలు, వల్లూరు మండలంలో 2, రైల్వేకోడూరులో 2, నందలూరులో ఒకటి, టి.సుండుపల్లెలో 2, పుల్లంపేటలో 2, కమలాపురం మండలంలో ఒక పంచాయతీలో ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలావుంటే రాష్ట్రవ్యాప్తంగా ఇవాల్టి(శుక్రవారం)నుంచి పంచాయితీ ఎన్నికల కోలాహలం ప్రారంభంకానుంది.  12 జిల్లాల్లోని 18 రెవిన్యూ డివిజన్లలో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. విజయనగరం జిల్లా మినహా మిగతా జిల్లాల్లో మొదటివిడత ఎన్నికలకు ఇవాల్టినుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలవనుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకూ నామినేషన్ల స్వీకరించనున్నారు. ఈ నెల 31 వరకూ ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 

ఇక ఈ నామినేషన్ల గడువు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 4 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు కల్పించారు. ఇక ఫిబ్రవరి 9న ఆయా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలనుంచి కౌంటింగ్ జరిపి ఫలితాన్ని వెల్లడించనున్నారు. దీంతో మొదటి విడత పంచాయితీ ఎన్నికలు పూర్తవుతాయి. ఆ వెంటనే రెండో విడత కోలాహలం మొదలవుతుంది. 

read more   సజ్జల రామకృష్ణా రెడ్డి పదవికి గండం: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ

అయితే పంచాయితీ ఎన్నికలలో స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లా కలెక్టర్ల వినతి మేరకు ఎన్నికలు జరగాల్సిన పంచాయితీలలో మార్పులు చేసినట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు డివిజన్ లో 20 మండలాలకు గాను 15కు మాత్రమే తొలిదశలో ఎన్నికలు నిర్వహించనుండగా.. మిగిలిన ఐదు మండలాలకు రెండవ దఫాలో ఎన్నికలు జరగనున్నాయి.  పంగులూరు, కోరిశపాడు, ఎస్.మాగులూరు, అద్దంకి, బల్లికురవ మండలాలలో పంచాయితీలకి ఫిబ్రవరి 9కి బదులు 13వ తేదీన రెండవ దఫాలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం మండలానికి 3వ దఫాకు బదులుగా 2వ దఫాలోనే ఎన్నికలు నిర్వహించనుండగా.. ఏలూరు డివిజనులోని నాలుగు మండలాలకు నాల్గవ దఫా బదులుగా మూడవ దఫాలోనే ఎన్నికలు జరపనున్నారు.చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం,టి.నర్సాపురం మండలాలలోని పంచాయితీలకి ఫిబ్రవరి 21 బదులుగా ఫిబ్రవరి 17న మూడవ విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన మండలాలకు మాత్రం ముందుగా నిర్ణయించిన ప్రకారం నాల్గవ దఫాలో ఎన్నికలు జరపనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్