
సినిమా థియేటర్‌ను జప్తు చేసే అధికారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే కారణంతో సినిమా థియేటర్‌కు తాళం వేసే/జప్తు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తహసీల్దార్ థియేటర్‌కు తాళం వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏపీ సినిమా (నియంత్రణ) రూల్స్ 1970 ప్రకారం.. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న సంయుక్త కలెక్టర్ అధికారం ఇచ్చిన వ్యక్తికి మాత్రమే థియేటర్‌ను జప్తు చేయాల్సి ఉంటుందని తెలిపింది. రూల్స్ ప్రకారం జేసీకి మాత్రమే సినిమా థియేటర్‌ను మూసివేసే అధికారం ఉందని పేర్కొంది. ప్రస్తుత కేసులో సంయుక్త కలెక్టర్ ఆ అధికారం తహసీల్దార్‌కు ఇవ్వలేదని పేర్కొంది.
వివరాలు.. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో శ్రీనివాస మహల్ లైసెన్స్ పునరుద్ధరణ కాలేదని తహసీల్దార్ మూసివేయడాన్ని సవాల్ చేస్తూ మేనేజింగ్ పార్టనర్ శంకర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వ్యవహరించారని చెప్పారు. అయితే ఆ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. థియేటర్‌ను తెరవాలని తహసీల్దార్‌ను ఆదేశించింది.
లైసెన్స్ పునరుద్ధరణ అంశం లైసెన్స్ జారీ అధికారి ముందు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ థియేటర్‌లో సినిమాలు ప్రదర్శించుకోవడానికి యజమాన్యానికి అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ (Justice Ch Manavendranath Roy) ఇటీవల ఉత్తర్వులిచ్చారు.