విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కౌంటర్ దాఖలు చేయడానికి మరో అవకాశం కోరింది కేంద్రం. అయితే ఇదే చివరి అవకాశమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 29వ తేదీన బిడ్డింగ్ కు కేంద్రం పూనుకొంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే అలాంటిదేమీ లేదని కేంద్రం తెలిపింది.
అమరావతి:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి చివరి అవకాశాన్ని ఇచ్చింది ఏపీ హైకోర్టు. సోమవారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.మాజీ సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు విచారణ నిర్వహించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కౌంటర్ దాఖలు చేసేందుకు కనీసం సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోర్టును కేంద్రం కోరింది. ఇదే చివరి అవకాశమని హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ నెల 29వ తేదీన బిడ్డింగ్ కు కేంద్రం పూనుకొంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయమై కేంద్రం వివరణ కోరింది హైకోర్టు.
అయితే అలాంటిదేమీ లేదని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఆగష్టు 2వ తేదీకి విచారణను వాయిదా వేసింది హైకోర్టు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆందోళన కొనసాగిస్తోంది. తమ ఆందోళనకు మద్దతు తెలపాలని జేఏసీ నేతలు రాజకీయ నేతలను కోరారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని కూడ ఎంపీలను కోరిన విషయం తెలిసిందే.