ఏపీ హైకోర్టులో ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి ఎదురు దెబ్బ తగిలింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తిరిగి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.
అమరావతి: పరిషత్ ఎన్నికల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్నికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది.
పరిషత్ ఎన్నికలను ప్రక్రియను కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ, బిజెపి, జనసేన పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై విచారణ జరుగుతున్న క్రమంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఎన్నికలను కొనసాగించడానికి అనుమతి ఇస్తూ తమ తీర్పు వచ్చే వరకు ఫలితాలను నిలిపేయాలని ఆదేశించింది. దాంతో ఓటింగు జరిగినప్పటికీ ఓట్ల లెక్కింపు ఆగిపోయింది.
undefined
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్న సమయంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను మధ్యలో ఆపేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆయన మధ్యలోనే ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు అనుమతితో తిరిగి ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. పరిషత్ ఎన్నికలపై ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండానే పదవీ విరమణ చేశారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో ఎస్ఈసీగా నియమితులైన నీలం సాహ్ని ఆగిపోయిన దగ్గరి నుంచి పరిషత్ ఎన్నికలను నిర్వహిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దాంతో ఓటింగ్ ప్రక్రియ కొనసాగినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. హైకోర్టు తీర్పుతో పూర్తిగా ఎన్నికలు రద్దవుతున్నాయి.
హైకోర్టు జస్టిసీ సత్యనారాయణ మూర్తి ఎన్నికలను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఎపీ ఎస్ఈసీ వెళ్లే ఆలోచన చేస్తోంది. అయితే, ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఏపీ ఎస్ఈసీ లంచ్ మోషన్ పటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది.
పరిషత్ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 8వ తేదీన జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి లేదా ఓటర్లను కలుసుకోవడానికి నాలుగు వారాల వ్యవధి ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు.