కరోనా వైరస్ కు ఆనందయ్య ఇస్తున్న మందుకు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. ఆయన మందు ప్రభావంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఓ వార్డు ఖాళీ అయింది. ఆ మందును స్థానిక ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
నెల్లూరు: కరోనా చికిత్సకు ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఇస్తున్న మందుకు రాజకీయ నాయకుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఆయన మందు ప్రభావం నెల్లూరు జిజీహెచ్ మీద పడింది. నెల్లూరు జిజిహెచ్ లోని ఓ వార్డులో ఉన్న కరోనా రోగులు అందరూ ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం దారి పట్టారు. వార్డును ఖాళీ చేసి వెళ్లిపోయారు.
కాగా, స్థానిక ఎమ్మెల్యే కాకాని శుక్రవారంనాడు మందు పంపిణీ చేశారు. 3 వేల మంది కోసం ప్రస్తుతం మందు తయారు చేసినట్లు తెలిస్తోంది. కృష్ణపట్నంలోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.వేలాది మంది కృష్ణపట్నం వైపు అడుగులు వేశారు.
undefined
దాంతో పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.. కృష్ణపట్నంలోకి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం లోని ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు.
ఆనందయ్య మూడు వేల మందికి మాత్రమే మందును తయారు చేశారు. దాదాపు 5 వేల మంది క్యూలో నించున్నారు. ముత్తుకూరు మండలంలోనే 15 వేల మందిని ఆపేశారు. తోపులాట కూడా చోటు చేసుకుంది.
Also Read: హాట్ టాపిక్: కరోనాకు ఆనందయ్య ఆయుర్వేద మందు, వేలాదిగా ఎగబడుతున్న జనం
కాగా, ఆనందయ్య మందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతోందని ఆయన అన్నారు.ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తోందని ఆయన చెప్పారు.
గతంలో ఆయన తల్లి కూడా మందులు ఇచ్చే వారని, ఆనందయ్య తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ చెన్నై రెడ్ హిల్స్ లో ఉండే గురువు సహకారంతో సేవలందిస్తున్నారని చెప్పారు.కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటివరకు 70 వేల మందికి ఇచ్చారని, ఏ ఒక్కరి నుంచి నెగటివ్ రిపోర్ట్ లేదని ఆయన చెప్పారు.
ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీని అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు.హైదరాబాద్ లో చేప మందు ఇస్తున్నారని, నెల్లూరు మూలాపేటలో రోజూ దండ వేస్తారని, తమ అల్లీపురం మేకలవారితోటలో వేపాకు మండ వేస్తారని ఆయన అన్నారు.
ఎవరి నమ్మకం వారిదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు ఈ రోజు రెమిడెసివర్ వంటి ఎన్నో మందులు వాడినా, ప్రైవేటు ఆస్పత్రులకు లక్షలు ధారపోసినా ప్రాణాలు పోతున్నాయని ఆయన చెప్పారు.ఐసీయూలోకి పోతే ఎంత మంది బయటకు వస్తారో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు.
ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు తయారీలో ఉపయోగిస్తున్నవి తిప్పతీగ, తాటిబెల్లం, పట్ట, తేనె, లవంగాలు, వేపాకు, మామిడి చిగురు, నేరేడు ఆకు, పిప్పింటాకు, బుడబుడసాకు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, జాజికాయ తదితరాలు అని, వాటిలో హానికరమైనవి ఏవీ లేవని ఆయన చెప్పారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇస్తున్న మందుతో నష్టం ఏమైనా ఉందా ఆయన ప్రశ్నించారు.
ప్రతిష్టాత్మక వైద్యసంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే దేనిపైనా క్లారిటీ లేదని, ఆక్సిజన్ సప్లయి చేయలేరు..బెడ్లు ఇవ్వలేరు..ఇలాంటి పరిస్థితుల్లో ఆనందయ్య ఉచితంగా ఇచ్చే మందు పంపిణీకి మద్దతు తెలపాలని ఆయన అన్నారు.. ఆనందయ్యకు గ్రామస్తులు కూడా అండగా నిలిచి మందు తయారీ, పంపిణీలో 30 మంది యువకుల వరకు సహాయంగా నిలుస్తున్నారని చెపపారు.