కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి రామకృష్ణాచార్యులకు ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.
అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఏపీ హైకోర్టు శిక్ష విధించింది.2017లో హైకోర్టు తీర్పును అమలు చేయనందుకు శిక్షతో పాటు జరిమానాను విధిస్తున్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది.అసెంబ్లీ కార్యదర్శి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా గత వారమే హైకోర్టు ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకుండా అసెంబ్లీ కార్యదర్శి రామకృష్ణాచార్యులు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టుగా కోర్టు ఈ నెల 17న తేల్చింది. ఇవాళ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశం మేరకు ఇవాళ కోర్టుకు అసెంబ్లీ సెక్రటరీ హాజరయ్యారు.
కోర్టు సమయం ముగిసేవరకు కూర్చోవాలని కోర్టు అసెంబ్లీ సెక్రటరీ రామకృష్ణాచార్యులుకు శిక్ష విధించింది. అంతేకాదు వెయ్యి రూపాయాలు జరిమానాను చెల్లించాలని కూడా ఆదేశించింది.
ఈ నెల 18వ తేదీన కోర్టుకు హాజరైన బాలకృష్ణమాచార్యులు కోర్టుకు క్షమాపణలు చెప్పాడు. అయితే సెక్రటరీ వైఖరి ఆమోదం కాదని కోర్టు అభిప్రాయపడింది. శిక్షను స్వీకరించడానికి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.