ఏపీలో చల్లారని గోరంట్ల వీడియో వ్యవహారం... మీరు రంగంలోకి దిగండి : సీబీఐకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు

By Siva KodatiFirst Published Aug 16, 2022, 9:05 PM IST
Highlights

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనితో పాటు సదరు వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా ఆయన జత చేశారు. మాధవ్ వీడియోపై దర్యాప్తు జరపాలని లక్ష్మీనారాయణ సీబీఐని కోరారు. 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అది ఫేక్ వీడియో అని అనంతపురం ఎస్పీ స్వయంగా ప్రకటించినప్పటికీ.. విపక్షాలు మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ఆ వీడియోలో వున్నది నూటికి నూరుశాతం మాధవేనని టీడీపీ ఆరోపిస్తుండగా.. మార్ఫింగ్ చేశారని గోరంట్ల మాధవ్, ఆయన మద్ధతుదారులు వాదిస్తున్నారు. దీనికి తోడు మాధవ్ వ్యవహారం రాష్ట్రంలో కమ్మ వర్సెస్ కురుబగా మారి కులాల మధ్య చిచ్చుపెడుతోంది. అగ్రవర్ణానికి చెందిన నేతలు.. బీసీ కులానికి చెందిన ఎంపీ ఎదిగితే ఒర్చుకోలేకపోతున్నారని కురుబ నేతలు మండిపడుతున్నారు. అటు మాధవ్ పదే పదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటున్నారని.. ఆ క్యాస్ట్ లీడర్లు ఫైరవుతున్నారు.

ఈ నేపథ్యంలో మాధవ్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ఎంపీ ఘటనపై ఏపీ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెన్నైలోని సీబీఐ (CBI) కార్యాలయానికి ఆయన మంగళవారం మెయిల్ ద్వారా ఫిర్యాదును పంపారు. దీనితో పాటు సదరు వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా లక్ష్మీనారాయణ జత చేశారు. మాధవ్ కారణంగా రెండు సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రేగే అవకాశం వుందని.. దీనిపై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సీబీఐని కోరారు. 

Also Read:న్యూడ్ వీడియో కాల్.. దుష్ప్రచారం ఆపకుంటే పాత మాధవ్‌ని చూస్తారు : గోరంట్ల మాధవ్ వార్నింగ్

అంతకుముందు విపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav video). ‘న్యూడ్ వీడియో’ వివాదం అనంతరం తొలిసారిగా హిందూపురానికి బయల్దేరిన మాధవ్‌కు ఆదివారం కర్నూలు టోల్‌గేట్ వద్ద కురుమ సంఘం నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ... మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాధవ్ వ్యాఖ్యానించారు. వీడియో మార్ఫింగ్‌దా లేదంటే నిజమైనదా అని తేల్చేందుకు పోలీసులు వున్నారని ఆయన అన్నారు. తనపై దుష్ప్రచారం ఆపకుంటే పాత మాధవ్‌ను చూస్తారంటూ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. 

కాగా.. ఈ నెల 10వ తేదీన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఎంపీ మాధవ్ వీడియో నకిలీదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను పోస్టు చేసిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నామని.. దీనిని మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసినట్టుగా ఉందని, ఒరిజినల్ వీడియో దొరికితేనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని ఎస్పీ వివరించారు. అనంతపురం ఎస్పీ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండా ఈ వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. ఎస్పీ ఫోరెన్సిక్ నిపుణుడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 

click me!