
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై (Movie Tickets Price) హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. టికెట్ ధరల నియంత్రణపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో 35 రద్దు (Go No. 35) అన్ని థియేటర్లకు వర్తిస్తుందని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ల ముందుంచాలని హైకోర్టు సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. ఇందుకు సంబంధించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది. ఇక, గత విచారణ తర్వాత పిటిషనర్లకు మాత్రమే జీవో నుంచి మినహాయింపు వర్తింస్తుందని ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి చెప్పిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం జీవో నెంబర్ 35ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ ధర పెంచుకునే అధికారం థియేటర్ యజమానులకు ఉంటుందని వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టు టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను రద్దు చేసింది. పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునేందుకు పిటీషనర్లకు వెసలుబాటు కల్పించింది.
ఈ క్రమంలోనే స్పందించిన ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాష్ట్రంలో జీవో నెం.35 అమల్లోనే ఉందని వెల్లడించారు. జీవో 35పై హైకోర్టు తీర్పు పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. మరోవైపు జీవో నెంబర్ 35 రద్దు చేయడంపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది.