పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. సజ్జల, సీఎస్‌తో భేటీ కానున్న సీఎం జగన్.. నేడు ఫిట్‌మెంట్‌‌పై క్లారిటీ..!

Published : Dec 20, 2021, 01:02 PM IST
పీఆర్సీపై కసరత్తు ముమ్మరం.. సజ్జల, సీఎస్‌తో భేటీ కానున్న సీఎం జగన్.. నేడు ఫిట్‌మెంట్‌‌పై క్లారిటీ..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు (Andhra Pradesh govt employees) సంబంధించి పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు (Andhra Pradesh govt employees) సంబంధించి పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉద్యోగ సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో కూడా ఉద్యోగ సంఘాలు చర్చలు జరిపాయి. ఈ క్రమంలోనే తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలను మంత్రి బుగ్గన, సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్‌‌తో భేటీ అయి ఆయనకు వివరించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం జగన్ వారితో చర్చించారు. 

అయితే తాజాగా ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. పిట్‌మెంట్‌పై చర్చించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో సీఎం జగన్ (CM Jagan) నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ ఎంత ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే 27 శాతం ఐఆర్‌ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఐఆర్‌ 27 శాతం ఇస్తున్నందున.. 14 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఐఆర్‌ ఇప్పటికే ఇస్తున్నందన.. కొత్తగా ఇస్తున్నది ఏంటో చెప్పాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఉద్యోగుల ఫిట్‌మెంట్ డిమాండ్‌పై స్పందించిన సజ్జల..  ఉద్యోగులు కోరుతున్నట్లుగా 27 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ సాధ్యం కాదన్నారు. సీఎస్‌ కమిటీ సిఫారసు చేసిన 14.29 శాతం ఫిట్‌మెంట్‌ అమలు వల్ల ఉద్యోగులకు ఏ మాత్రం నష్టం ఉండదని అన్నారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్‌ ఇస్తున్నామని.. 14.29 శాతం ఫిట్‌మెంట్‌తో ఐఆర్ కంటే ఒక్క రూపాయి కూడా తగ్గదని, ఐఆర్ కంటే కొంత ఎక్కువగానే లాభం ఉంటుందని వివరణ ఇచ్చారు. ఉద్యోగుల వేతన సవరణపై సీఎం జగన్‌దే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నేడు ఉద్యోగుల ఫిట్‌మెంట్‌కు సంబంధించి సీఎం జగన్.. సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్