
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డులో సభ్యుల అర్హతలను ప్రశ్నిస్తూ బిజెపి (bjp) నేత భానుప్రకాష్ రెడ్డి దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇవాళ(మంగళవారం) ఏపీ హైకోర్టు (AP high court) విచారణ జరిపింది. నేర చరితులను పవిత్రమైన దేవస్ధానానికి సంబంధించిన బోర్డులో స్థానం కల్పించడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిల్ ను గతంలోనే హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలోనే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, టీటీడీ కార్య నిర్వహణాధికారికి నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు 18 మంది టిటిడి బోర్డ్ మెంబర్స్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించారు. అయితే గడువు ముగిసినా ఇప్పటివరకు నోటీసులు అందుకున్న బోర్డు సభ్యులెవ్వరూ స్పందించలేదు.
ఇదే విషయాన్ని ఇవాళ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన పిటిషనర్ తరపు న్యాయవాది ముగ్గురు సభ్యులు కోర్టు నోటీసులు కూడా స్వీకరించలేదని తెలిపారు. దీంతో నోటీసులు స్వీకరించిన అల్లూరి మహేశ్వరి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎం.ఎన్.శశిధర్ లపై ఫిల్ దాఖలైనట్లు పత్రికా ప్రకటన ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టుు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.