ప్రభుత్వ భూముల అమ్మకాలు అందుకోసమే...: హైకోర్టు కు వివరించిన పిటిషనర్

By Arun Kumar PFirst Published May 27, 2020, 7:16 PM IST
Highlights

ప్రభుత్వ భూముల అమ్మకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై ఏపి హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అమలు, మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలంటూ విలువైన ప్రభుత్వ భూములను వైసిపి ప్రభుత్వం అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల అమ్మకాలకు టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  

ఈ విషయంపైనే కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఏపీలో భూముల అమ్మకాలపై ప్రభుత్వం తెచ్చిన జీవోను సస్పెండ్‌ చేయాలని కోరుతూ డాక్టర్‌ శైలజ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది.   

పిటిషనర్‌ తరపున న్యాయవాది డీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన ఏడాది కాలంగా ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా లేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు.  రూ.వేల కోట్లు దుర్వినియోగం చేసి ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు అమ్మడం దారుణమన్నారు. నవరత్నాల అమలు కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ఏమిటని న్యాయవాది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ టైమ్‌లో కూడా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని న్యాయవాది ప్రసాద్‌  పేర్కొన్నారు. 

విశాఖపట్నంలో ఆరు, గుంటూరులో మూడు చోట్ల ఇ-ఆక్షన్ ద్వారా భూముల అమ్మకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్ ఈ అమ్మకాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ నెల 29న ఇ-ఆక్షన్ ద్వారా వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. నగదు చెల్లింపు తరువాతే భూములపై పూర్తి హక్కులు కొనుగోలుదారులకు రానున్నాయి. ఎలాంటి ఆక్రమణలు, తగాదాలు లేకుండా భూములు వేలం వేస్తున్నట్లు బిల్డ్ ఏపీ ప్రకటించింది. 

అయితే మిషన్‌బిల్డ్ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లస్థలాలకు భూములు లేవంటున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే తతంగానికి తెరతీశారని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు ఇంతకుముందే ఆరోపించారు. 

read more  ఆ భూములు అమ్మినా...మేం అధికారంలోకి రాగానే లాక్కుంటాం: బోండా హెచ్చరిక

మిషన్‌బిల్డ్ వంకతో తమపార్టీ తాబేదార్లకు, అనుమాయులకు ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడానికి వైసీపీ సర్కారు ఉత్సాహం చూపడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయాంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తామని చెప్పి వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కాజేసిన వాన్‌పిక్‌ లాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం వైసీపీ ప్రభుత్వానికి చేతగాలేదన్నారు.

అటువంటి సంస్థల కింద ఉన్న భూముల్ని వదిలేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వభూములపై కన్నేసిన జగన్ ఎన్నికల సమయంలో తనకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యక్తులకు వాటిని కట్టబెట్టే కుతంత్రానికి తెరతీశాడని మండిపడ్డారు. ఉన్న భూముల్ని ఇష్టమొచ్చినట్లు తనవారికి దారాధత్తం చేస్తే, భవిష్యత్‌లో ప్రజల అవసరాలకు భూములు ఎక్కడినుంచి వస్తాయో వైసీపీ అధినేత సమాధానం చెప్పాలన్నారు. 

ప్రభుత్వమే రియల్‌ఎస్టేట్‌ కంపెనీలా వ్యవహరించడం దారుణమని ఆయన వాపోయారు.  ఓవైపు ప్రైవేట్‌భూములు కొనుగోలుచేసి పేదలకు ఇస్తామంటూనే ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అమ్మాలని చూడటం జగన్‌ తుగ్లక్‌ చర్యల్లో భాగమేనని రంగారావు దుయ్యబట్టారు. వనరుల నుంచి సంపద సృష్టించడం చేతగాని అసమర్థ వైసీపీ ప్రభుత్వం భూముల్ని అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం సిగ్గుచేటన్నారు. 

లోటుబడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన చంద్రబాబు, రాష్ట్రాన్ని ఆర్థికంగా  ఆదుకునేందుకు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా చేశారని సుజయకృష్ణ తెలిపారు. వైసీపీ పాలన చూసి భయభ్రాంతులకు గురైన పారిశ్రామికవేత్తలు పక్కరాష్ట్రాలకు తరలిపోతుంటే బ్యాంకుల, ఇతర రుణ మంజూరు సంస్థలు ప్రభుత్వ వైఖరితో చేతులేత్తేసిన దుస్థితిని రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. 

పెట్టుబడిదారుల్లో నమ్మకం సృష్టించలేని వైసీపీ సర్కారు చివరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి పూనుకుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న ఆదానీ గ్రూప్‌ (రూ.70వేలకోట్ల పెట్టుబడులతో విశాఖ పట్నంలో పెట్టాలనుకున్న పరిశ్రమ) తెలంగాణకు తరలడానికి సిద్ధమైందన్నారు. 


 

click me!