
ఐఆర్ఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్(APEDB) మాజీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్‌కు ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన హైకోర్టు లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేసింది. దీంతో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వివరాలు.. జాస్తి కృష్ణ కిషోర్.. 2014 వరకు ఆదాయపన్ను శాఖ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కిషోర్‌ను ఏపీకి డిప్యూట్ చేశారు. అయితే ఏపీఈడీబీగా సీఈవోగా ఉన్న సమయంలో కృష్ణ కిషోర్ అవతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఎం జగన్ ప్రభుత్వం.. అతనిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై కృష్ణ కిషోర్‌పై మంగళగిరి సీఐడీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు.
అయితే తన సస్పెన్షన్‌పై కృష్ణ కిషోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే ఆయనపై సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేసింది. జాస్తి కృష్ణ కిషోర్‌ను తిరిగి ఆదాయపు పన్ను శాఖకు తిరిగి తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆ తర్వాత కృష్ణ కిషోర్ ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ గ్రేడ్‌కు పదోన్నతి పొందారు. న్యూఢిల్లీలోని ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో OSDగా నియమించబడ్డారు.
ఇక, కృష్ణ కిషోర్‌పై నమోదైన కేసులకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తాజాగా ఆయనపై కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణ కిషోర్ లాభపడినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది. దురుద్దేశపూర్వకంగానే కృష్ణ కిషోర్‌పై కేసు పెట్టినట్టుగా హైకోర్టు అభిప్రాయపడింది. భజన్‌లాల్ కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కేసును కొట్టవేసినట్టుగా వెల్లడించింది.
ఇక, గతంలో కృష్ణ కిషోర్ హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ సర్కిల్‌లో పని చేసిన సమయంలో జగతి పబ్లికేషన్‌పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులను మనసులో పెట్టుకుని కక్షసాధింపుగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనను సస్పెండ్ చేసి తప్పుడు కేసు పెట్టినట్టుగా కృష్ణ కిషోర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన కోర్టు కేసులకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో సీఐడీ విఫలమైందని..ఈ కేసులన్నింటినీ కొట్టివేసింది.