
తెలుగు‘దేశం’లో మహిళను బట్టి న్యాయం జరుగుతున్నట్లుంది. అధికారిణికి ఒక న్యాయం. దిగువస్ధాయి ప్రజాప్రతినిధులకైతే ఓ న్యాయం. అదే మహిళ ఎంఎల్ఏ, అందునా ఫిరాయింపుకైతే ఇంకో న్యాయం జరుగుతోంది. ఇంతకీ విషయమేమిటంటే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలపై దాడులు పెరిగిపోయాయి. ఆమధ్య కృష్ణాజిల్లాలోని ఎంఆర్ఓ వనజాక్షిపై ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ దాడిచేసారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం. స్వయంగా చంద్రబాబే ఇద్దరి మధ్యా పంచాయితీ చేసారు. చివరకు విచారణ అని చెప్పి వనజాక్షిదే తప్పని తేల్చేసారు.
తర్వాత గుంటూరు జిల్లాలోని ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధుల వివాదం తెరపైకి వచ్చింది. బాపట్ల మండల పరిషత్ అధ్యక్షురాలిగా గెలిచిన విజేతమ్మను రాజీనామా చేయమంటూ దేశం నేతలు రకరకాలుగా ఒత్తిడి పెట్టారు. దాంతో ఆమె ఒత్తిడికి తట్టుకోలేక గుండెనొప్పితో కుప్పకూలిపోయారు. అలాగే, మాచర్ల మున్సిపల్ ఛైరపర్సన్ గా గెలిచిన శ్రీదేవిని కూడా రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెట్టారు. నేతల ఒత్తిడిని తట్టుకోలేక శ్రీదేవి భర్త మల్లికార్జున గుండెపోటుతో మరణించారు. దాంతో శ్రీదేవి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, జెడ్పి ఛైర్ పర్సన్ జానీమూన్ వివాదమైతే చెప్పనే అక్కర్లేదు.
తాజా ఘటన ఎంఎల్ఏ అఖిలప్రియకు సంబంధించినది. రాజధాని గ్రామాల నుండి వస్తున్న జగన్ కాన్వాయ్ కు వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా అఖిలప్రియ ఎదురు వచ్చారు. జగన్ వాహనాల రద్దీని దాటి ముందుకు వెళ్లలేక ఎంఎల్ఏ వెనుదిరిగారు. ఆ సందర్భంలో కొందరు కార్యకర్తలు ఎంఎల్ఏ కారు చుట్టూ మూగారు. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేసారు.
ఘటన వెలుగు చూసిన తర్వాత అఖిలప్రియ మాట్లాడుతూ తనపై ఎవరు దాడి చేయలేదనే చెప్పారు. మద్యం సేవించి అసభ్యంగా మాట్లాడారని మాత్రమే అన్నారు. అయితే, తెరవెనుక ఏమైందో తెలీదు. మరుసటి రోజు తాను ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసారంటూ ఎంఎల్ఏ కేసు పెట్టారు. వెంటనే పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు కూడా చేసేరు.
పై ఘటనలు చూస్తుంటే ‘దేశం’లో మహిళను బట్టి న్యాయం జరుగుతుందా అన్న సందేహం వస్తోంది. ఎంఆర్ఓ వనజాక్షిపై టిడిపి ప్రజా ప్రతినిధులు దాడులు చేసినా పట్టించుకోలేదు. సొంతపార్టీలోని మహిళా నేతలు విజేతమ్మ, శ్రీదేవిల బలవన్మరణాల బాధ్యులపై చర్యలు లేవు. జానీమూన్ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అల్లరి పెరగకుండా చూసారంతే. ఇక ఎంఎల్ఏ ఫిరాయించారు కాబట్టి పోలసులు వెంటనే స్పందించారు. మరి ఇదే వేగం పై మహిళలకు న్యాయం చేయటంలో ప్రభుత్వం ఎందుకు కనబరచలేదు? అంటే మహిళను బట్టి న్యాయం ఉంటుందను కోవాలి.