
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నానితో (Kodali Nani) పాటుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. భద్రత పెంచిన ఎమ్మెల్యేల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi), కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి (dwarampudi chandrasekhar reddy), సత్తెనపల్లె ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) ఉన్నారు. వారికి ముప్పు పొంచి ఉందనే ఇన్‌పుట్స్ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న భద్రతను పెంచినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
మంత్రి కొడాలి నానికి ప్రస్తుతం 13 మంది భద్రత సిబ్బంది ఉండగా.. మరో నలుగురిని పెరిగారు. దీంతో కొడాలి నానికి 17మంది భద్రత సిబ్బంది ఉండనున్నారు. అంతేకాకుండా కొడాలి నాని కాన్వాయ్ లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కల్పించింది. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ లకు ప్రస్తుతం ఉన్న 1+1 సెక్యూరిటీని 3+3 సిబ్బంది పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారికి ఇక నుంచి 4+4 సెక్యూరిటీ ఉండనుంది.
అయితే ఈ భద్రత పెంపుకు ఇటీవల ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలే కారణంగా తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట వల్లభనేని వంశీ.. లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యాలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. శాసనసభలో కొందరు వైసీపీ నేతలు తన భార్యను దూషించారంటూ చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. మరోవైపు నందమూరి కుటుంబం (Nandamuri family) కూడా ఇందుకు సంబంధించి తీవ్రంగా స్పందించింది.
ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ స్పందించి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు భద్రత పెంచుతున్నట్లు ప్రకటించింది. టీడీపీ సానుభూతి పరుల నుంచి, నందమూరి అభిమానుల నుంచి ఈ నలుగురిపై దాడులు జరిగే అవకాశం ఉందనే సమాచారంతోనే ప్రభుత్వం భద్రత పెంపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇది సరైన పద్దతి కాదని హితవు పలికిన నందమూరి కుటుంబ సభ్యులు.. తాము చేతులు కట్టుకుని కూర్చోలేదని హిందుపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హెచ్చరించారు. తన సోదరి భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యాలు బాధించాయని తెలిపారు. బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీచేశారు.