
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్తపథకాన్ని అమలుచేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా (Rythu Bharosa), నష్టం వచ్చిన సీజన్ లోనే పరిహారం, వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. రైతులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై అందజేయనుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు ఇస్తామని సీఎం జగన్ గతంలోనే ప్రకటించారు. దీనిలో భాగంగా రైతు రథం పేరుతో అన్నదాతలకు ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు. జూన్ 6న తేదీన రైతు రథం (rythu ratham scheme) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అదే రోజున రైతులకు 6 వేల ట్రాక్టర్లను పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
రైతులు నేరుగా వాళ్ళకు నచ్చిన కంపెనీ ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చని, వాటికయ్యే నగదు సబ్సిడీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని... రైతు శ్రేయస్సు కోసం జగన్ సర్కార్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. రైతు రథం కింద ట్రాక్టర్ పొందడానికి ముందుగా గ్రామంలోని చిన్న, సన్నకారు రైతులు ముగ్గురికి తగ్గకుండా ఒక గ్రూప్‌గా ఏర్పడి ఆ గ్రూపుకి ఒక పేరు పెట్టుకోవాలి.
ప్రతి రైతు తమ పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో పాటు బ్యాంక్ నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ను రైతు భరోసా కేంద్రంలో అందించాలి. ఆ తర్వాత గ్రూప్ పేరు మీద బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేసి గ్రూప్‌కి లింక్ చేయించాలి. ఈ ప్రక్రియ మొత్తం జూన్ రెండు లోపల పూర్తి చేసుకున్నట్లైతే దరఖాస్తును పరిశీలించి అర్హులైన వారిని రైతు రథం పథకం క్రింద ఎంపిక చేస్తారు. రైతులు ఎంపిక చేసుకున్న ట్రాక్టర్ వివరాలను కూడా అందిస్తే సబ్సిడీ మొత్తాన్ని రైతు గ్రూప్ అకౌంట్‌లో జమ చేస్తారు. రైతులు మిగిలిన మొత్తాన్ని చెల్లించి ట్రాక్టర్ కొనుగోలు చేయవచ్చు