‘‘గాలి’’కి తవ్వకాల అనుమతులపై మీడియాలో కథనాలు... స్పందించిన ఏపీ ప్రభుత్వం

By Siva KodatiFirst Published Aug 10, 2022, 10:05 PM IST
Highlights

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డికి గనుల తవ్వకాలకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. 
 

కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డికి మరోసారి ఓబుళాపురం గనుల్లో తవ్వకాలు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించినట్లుగా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఓబుళాపురం గనుల విషయంలో రాష్ట్రప్రభుత్వానికి దురుద్దేశాలను అంటగట్టేలా ఈనాడు పత్రిక 'గాలి' అడిగితే కాందంటామా అంటూ వాస్తవాలను వక్రీకరించేలా కథాన్ని ప్రచురించిందని డీఎంజీ వీ.జీ వెంకట రెడ్డి అన్నారు. 

ఓబుళాపురం ప్రాంతంలో మూడు ఐరన్ ఓర్ గనులకు  50 సంవత్సరాల లీజు కాలపరిమితి గత ఏడాదితో ముగిసిందని ఆయన గుర్తుచేశారు. ఇలా కాలపరిమితి ముగిసిన గనులకు 1957 గనుల చట్టం ప్రకారం ఈ-ఆక్షన్ ద్వారా తిరిగి లీజులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని వెంకట రెడ్డి తెలిపారు. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలోని గనులకు సంబంధించి అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం న్యాయస్థానంలో విచారణలో ఉందని ఆయన అన్నారు. ఇదే క్రమంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ధేశించిన మేరకు ఓబుళాపురం సరిహద్దులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం సర్వే రాళ్ళను  ఏర్పాటు చేసిందని వెంకట రెడ్డి వెల్లడించారు. 

ALso REad:గాలి జనార్థన్ రెడ్డికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఏపీ పరిధిలో మళ్లీ తవ్వకాలకు అభ్యంతరం లేదన్నప్రభుత్వం...

సరిహద్దుల నిర్ధారణ కూడా పూర్తయిన నేపథ్యంలో న్యాయస్థానంలో ఉన్న కేసును పరిష్కరించడం కోసం వాదనలను త్వరగా వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్వోకేట్ ఆన్ రికార్డ్స్ ను అభ్యర్థించిందని డీఎంజీ తెలిపారు. ఈ వివాదం పరిష్కారం అయితే మూడు గనులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ-ఆక్షన్ నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందులో గాలి జనార్థన్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వక్రీకరణలో ఈనాడు కథనాన్ని ప్రచురించడాన్ని ఖండిస్తున్నామని వెంకట రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

కాగా.. గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని గనుల్లో మళ్లీ తవ్వకాలు ప్రారంభించేందుకు మార్గం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.  తవ్వకాలు ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ ఆయనకు చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించింది. కర్ణాటకతో సరిహద్దు అంశంపై స్పష్టత వచ్చినందున.. తమ భూభాగంలో తవ్వకాలకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని  ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఓఎంసీ విజ్ఞప్తిని పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. 

ఆ కంపెనీపై దాఖలైన మరో కేసును విచారిస్తున్న ధర్మాసనానికి ఈ కేసును కూడా నివేదించాలని సూచించింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. వీటిపై సిబిఐ దర్యాప్తు జరుగుతోంది. 2009లో ఆ కంపెనీతవ్వకాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై ఓఎంసీ అప్పటి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. తీర్పు ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చింది. దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఒకపక్క ఓఎంసి కేసు విచారణ పెండింగ్లో ఉండగానే.. తన భూభాగం పరిధిలో తవ్వకాలకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం గమనార్హం.

click me!