సోమవారం నుంచి సమ్మెలోకి ఉద్యోగ సంఘాలు.. అడ్డుకునేందుకు జగన్ సర్కార్ వ్యూహాలు, ‘‘ఎస్మా’’పై కసరత్తు..?

Siva Kodati |  
Published : Feb 04, 2022, 06:17 PM IST
సోమవారం నుంచి సమ్మెలోకి ఉద్యోగ సంఘాలు.. అడ్డుకునేందుకు జగన్ సర్కార్ వ్యూహాలు, ‘‘ఎస్మా’’పై కసరత్తు..?

సారాంశం

సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి దిగుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ దీనిపై చర్చించినట్లుగా సమాచారం.   

ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు గాను ‘‘ఎస్మా’’ చట్టాన్ని (esma) ప్రయోగించేందుకు వున్న అవకాశాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్, ప్రజా రవాణా  సహా అత్యవసర సేవల నిలుపుదల వంటి అంశాల్లో ఎస్మా ప్రయోగించే అవకాశం వుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు సీపీఎస్ రద్దు, హెచ్ఆర్ఏ జీవోల్లో కూడా సవరణలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. అయితే అత్యవసర సేవలు మాత్రమే ఎస్మా పరిధిలోకి వస్తాయని.. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలో ఎమర్జెన్సీ సేవలను నిలుపుదల చేయడం లేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. 

మరోవైపు ఈ నెల 7వ తేదీ నుండి strike చేస్తామని  ఉద్యోగులు ప్రకటించిన నేపథ్యంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఇవాళ  చేపట్టిన పెన్ డౌన్, యాప్స్ డౌన్ పై చర్చించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ల పై  సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు.  పాలన స్తంభించకుండా  తీసుకోవాల్సిన  ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం అడిగి తెలుసుకున్నారు.

కాగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ ఏడాది జనవరి 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే జనవరి 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్ పై ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించలేదు. దీంతో సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకొన్నాయి.  జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె  నోటీసును అందించాయి. ఈ నెల 7వ తేదీ నుండి ఉద్యోగలు సమ్మెలోకి వెళ్లనున్నారు. గురువారం వేలాది మందితో ఛలో విజయవాడను ఉద్యోగ సంఘాలు నిర్వహించాయి. ఎన్ని అడ్డంకులను సృష్టించినా ఛలో విజయవాడను ఉద్యోగ సంఘాలు విజయవంతం చేశాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?