
ఉక్రెయిన్ (ukraine) నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలిస్తున్నామన్నారు ఏపీ టాస్క్‌ఫోర్స్ కమిటీ చీఫ్ కృష్ణబాబు (krishna babu) . శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం ఒక విమానం ముంబయి, మరొకటి రేపు తెల్లవారుజామున ఢిల్లీ చేరుకుంటాయని చెప్పారు. ముంబయి వచ్చే ఫ్లైట్‌లో 9 మంది, ఢిల్లీ వచ్చే విమానంలో 13 మంది విద్యార్థుల వివరాలను కేంద్రం అందజేసిందని కృష్ణబాబు పేర్కొన్నారు. ముంబయి, ఢిల్లీలలో రిసెప్షన్లు ఏర్పాటు చేయాలని సీఎం (ys jagan) ఆదేశించినట్లు వెల్లడించారు. కస్టమ్స్ ఆఫీసర్ రామకృష్ణను ముంబయి ఎయిర్‌పోర్టుకు వచ్చే విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేయమని ఆదేశించామన్నారు.
ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్ష్.. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకునే విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎంతమంది వస్తున్నారో తెలియదు, వారి చిరునామాపై కూడా క్లారిటీ లేదని కృష్ణబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం (ap govt) పేరుతో ప్లకార్డు పట్టుకుని అధికారులు ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉంటారని... జబితాలో పేరు లేకపోయినా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకుని వారికి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో, ముంబయిలో వసతి కల్పించి, ఆ తర్వాత వారి స్వస్థలాలకు పంపుతామన్నారు. పూర్తిగా ప్రభుత్వం ఖర్చులతోనే వారిని రాష్ట్రానికి తీసుకురావాలన్న సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేశామని కృష్ణబాబు వెల్లడించారు.
విద్యార్థులు ఉక్రెయిన్‌లోని సరిహద్దు ప్రాంతాలకు చేరుకుంటే అక్కడి నుంచి రిసీవ్ చేసుకుని పంపించే ఏర్పాట్లు చేస్తామని నిన్న ఉదయం విదేశాంగ శాఖ అధికారులు చెప్పారని ఆయన గుర్తుచేశారు. మళ్లీ నిన్న సాయంత్రం... విద్యార్థులు సరిహద్దు ప్రాంతాలకు రావొద్దు, ఎక్కడి వారు అక్కడే ఉండాలని సమాచారమిచ్చారని కృష్ణబాబు పేర్కొన్నారు. రష్యా సైన్యం పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదు కాబట్టీ ఎక్కడి వారు అక్కడే సేఫ్‌గా ఉండాలని సూచించారని.. బాంబింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న వారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బంకర్స్‌లోగానీ, ఇళ్లలోగాని వుండాలని సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని.. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ గ్రూప్‌లో ఉన్నారని, వీరందరికీ భారత విదేశాంగ శాఖ అందించే సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు.
విదేశాంగ శాఖ (ministry of external affairs) సూచనలు పట్టించుకోకుండా... ఎలాగొలా సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే భారత్‌కు తీసుకెళ్తారనే ఉద్దేశంతో విద్యార్థులు ఎలాంటి సాహసాలు చేయెద్దని కృష్ణబాబు హితవు పలికారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులను గమనించే విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుందని.. వాటిని కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని... రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ముఖ్యంగా 7 యూనివర్సిటీల పరిధిలో ఉన్నారని కృష్ణబాబు చెప్పారు. ఈ యూనివర్సిటీలన్నీ రొమేనియాకు దగ్గర్లోనే ఉన్నాయని.. భారత ఎంబసీ వెబ్‌సైట్‌లో (indian embassy in ukraine) పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు నేరుగా ఎంబసీ నుంచే సమాచారం వెళుతుందని వెల్లడించారు. ఏపీ విద్యార్థులకు ఎలాంటి భయాందోళనలు వద్దు అని కృష్ణబాబు భరోసా ఇచ్చారు.