
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని తెలిపింది. మొత్తం రూ.3 వేల కోట్ల బిల్లులు క్లియర్ చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి మంగళవారం కేబినెట్ సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ సహా వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు హాజరయ్యారు.
భేటీ అనంతరం సజ్జల మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని.. అందరం కలిస్తేనే లక్ష్యాలను సాధించగలుగుతామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కోవిడ్ , ఆర్ధిక సంక్షోభంతో ప్రభుత్వం కొంత ఇబ్బంది ఎదుర్కొందన్నారు. తమది ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వమని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం జరిగిందని సజ్జల అంగీకరించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఉద్యోగుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు గాను జీవోఎం మరోసారి సమావేశమైందని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్‌లో వున్న క్లెయిమ్స్‌ను మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామన్నారు. జీపీఎఫ్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, టీఏ, డీఏ ఇతర బకాయిలను ఈ నెలాఖరు నాటికి చెల్లిస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇవాళ జరిగింది చాయ్ బిస్కట్ మీటింగ్ కాదన్నారు. ఈ నెల 31 లోపు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామన్నారని ఆయన తెలిపారు. జిపిఎఫ్ కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని బండి శ్రీనివాసరావు వెల్లడించారు. 16 వేల కోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని.. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారికి బయో మెట్రిక్ తీసేయ్యాలని చెప్పామని బండి శ్రీనివాసరావు వెల్లడించారు. 60 నుంచి 62 ఏళ్లలో ఉన్న గురుకులాలు , నాన్ టీచింగ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు 62 వరకు పెంచుతామని చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16న ఉద్యోగుల హెల్త్ కార్డ్ లకు సంబంధించి సీఎస్ దగ్గర సమావేశం జరగనుందని బండి శ్రీనివాసరావు చెప్పారు.