భయపడొద్దు, కేంద్రం అండగా వుంది: ఏలూరు ఘటనపై సీఎంతో గవర్నర్

By Siva KodatiFirst Published Dec 8, 2020, 6:30 PM IST
Highlights

ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్‌తో మాట్లాడారు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్. స్దానికంగా నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్ తెలుసుకున్నారు

ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై సీఎం జగన్‌తో మాట్లాడారు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్. స్దానికంగా నెలకొన్న తాజా పరిస్ధితులను గవర్నర్ తెలుసుకున్నారు.

గత మూడు రోజులుగా సుమారు 467 మంది వింత వ్యాధి బారినపడి ఆసుపత్రిలో చేరారని, ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందించటం వల్ల 263 మంది కోలుకుని తమ నివాసాలకు చేరుకున్నారన్నారని సీఎం.. గవర్నర్‌కు వివరించారు.

వ్యాధి లక్షణాలతో ఆసుపత్రికి చేరుతున్న వారందరికీ పూర్తి స్దాయి వైద్యం అందిస్తున్నామని, కొందరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్దాయి వైద్య ఆరోగ్య పరిశోధనా సంస్ధల సహకారం తీసుకుంటున్నామని, ఎయిమ్స్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఐఎన్ వంటి సంస్ధలు బాధితుల రక్త నమూనాలతో పాటు అవసరమైన ఇతర అన్ని నమూనాలను పరిక్షిస్తున్నాయని జగన్ తెలిపారు.

వింత వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించే క్రమంలో, ప్రభుత్వపరంగా మరింత అప్రమత్తత అవసరమని, వేగవంతమైన పనితీరు కనబరిచేలా స్ధానిక, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగాన్ని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి గవర్నర్ సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉందని, ప్రజలకు అన్ని విధాల ధైర్యం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రికి తెలిపారు.

click me!