అమరావతి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాల పంపిణీకి ముహుర్తం ఖరారు.. !

By Sumanth KanukulaFirst Published May 9, 2023, 1:26 PM IST
Highlights

రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ఇతర ప్రాంతాల పేదలకు భూముల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది.

రాజధాని అమరావతి ఆర్-5 జోన్‌లో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా పనులను పూర్తి చేస్తోంది. ఆర్‌ 5 జోన్‌లో లేఅవుట్లు వేయ డం, ప్లాటింగ్‌ చేసే పనులు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రాంతంలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. ఈ నెల 18న ఆర్-5 జోన్‌లో పేదలకు భూములు పంపిణీ చేయనుంది. సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. 

ఇక, ఇటీవల హైకోర్టు తీర్పు తర్వాత.. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి లబ్ధిదారుల జాబితాలతో సిద్ధంగా ఉండాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. అమరావతి బయటి ప్రాంతాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇళ్ల స్థలాల మంజూరు కోసం 1,135 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నగరంలోని కొత్త జోన్ (ఆర్-5)ను ప్రభుత్వం రూపొందించిన సంగతి తెలిసిందే. 

Latest Videos

ఇదిలా ఉంటే.. రాజధాని అమరావతిలో బయట ప్రాంతాలకు చెందిన భూమిలేని పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ప్రభుత్వం జారీ  చేసిన జీవో 45, దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు తాము ఇచ్చే తుది తీర్పుకు లోబడి ఉండాలని  హైకోర్టు తెలిపింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన ఫుల్‌ బెంచ్‌ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించకపోవడంతో మధ్యంతర స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

ఈ క్రమంలోనే ఆర్- 5 జోన్‌ అంశంపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిచారు. ఈ అంశంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరారు. రైతుల పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని వారి తరపు న్యాయవాదులు సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజెఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావనకు తీసుకువచ్చారు. అయితే ఆ పిటిషన్‌ను వచ్చేవారం విచారించనున్నట్టుగా సీజేఐ ధర్మాసనం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి తేదీని ధర్మాసనం ఖరారు చేయలేదు. 

click me!