
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం తమ పాలనకు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు ప్రోత్సాహంగా రూపొందించిన ఈ పథకం కింద మొదటి విడత నిధులను విడుదల చేసింది. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల తల్లులకు ప్రయోజనం కలగనుంది. ఒక్కో తల్లికి రూ.15 వేలు అందిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, తాజాగా విడుదల చేసిన జీవోలో మాత్రం తల్లుల ఖాతాల్లో నేరుగా జమయ్యే మొత్తం రూ.13 వేలు మాత్రమేనని పేర్కొంది. మిగతా రూ.2 వేలు పాఠశాల అభివృద్ధి, నిర్వహణ నిధులకే వినియోగించనున్నట్లు పేర్కొంది.
గత ప్రభుత్వం అమలు చేసిన 'అమ్మ ఒడి' పథకం మాదిరిగానే, ప్రస్తుతం 'తల్లికి వందనం'లోనూ స్కూళ్ల నిర్వహణ కోసం నిధుల్ని మినహాయిస్తున్నారు. జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉన్న ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి.
ఈ పథకం అర్హతల ప్రకారం పట్టణాల్లో ఆదాయం రూ.12 వేలు లోపు, గ్రామాల్లో అయితే రూ.10 వేలు లోపే ఉండాలి. కుటుంబంలో ఎవరో ఒకరి పేరు రేషన్ కార్డులో ఉండాలి. భూమి పరిమితి మాగాణి మూడు ఎకరాలలోపు, మెట్ట 10 ఎకరాలలోపు.. రెండు కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవాళ్లే అర్హులు. వ్యక్తిగత వాహనాలు ఉండకూడదు కానీ ట్రాక్టర్, ఆటో వంటి ఉపాధి వాహనాలకు మినహాయింపు ఉంది. విద్యుత్ వినియోగం సగటున నెలకు 300 యూనిట్లు మించకూడదు. ఐటీ రిటర్న్లు వేసే వారు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అర్హులుగా పరిగణించరు.
గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు సమయానికి జమ కావాలని ఆదేశాలు ఇచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు నిధుల కొరత రాకుండా చూసే బాధ్యత అప్పగించారు.
ఇక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ పథకాన్ని మహిళలకు కానుకగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, షూస్ అందించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనం కోసం డొక్కా సీతమ్మ స్కీమ్ ద్వారా నాణ్యమైన భోజనం అందించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు శుభప్రదంగా చదువుకోవడమే లక్ష్యమని అన్నారు.