లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం..

By Sumanth KanukulaFirst Published Sep 8, 2022, 12:16 PM IST
Highlights

లోన్‌యాప్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆర్‌బీఐ అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

లోన్‌యాప్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆర్‌బీఐ అనుమతి లేని లోన్‌యాప్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇక, గత కొద్ది రోజులుగా ఏపీలో లోన్‌యాప్‌ నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. వారి వేధింపులకు భరించలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో లోన్ ‌యాప్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. 

ఇక, తాజాగా లోన్ యాప్  నిర్వాహకుల వేధింపులు భరించలేక ఉమ్మడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగికి చెందిన  కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.  దుర్గాప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రమ్యలక్ష్మి కుట్టుపని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. 

అయితే కొద్ది రోజుల క్రితం తమ కుటుంబ అవసరాల నిమిత్తం దుర్గాప్రసాద్ దంపతులు లోన్ యాప్ ద్వారా రూ. 50వేలను అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును సకాలంలో చెల్లించకపోవడంతో.. వడ్డీ పెరిగింది. దీంతో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి.  లోన్ డబ్బులు చెల్లించకపోతే ‘‘మీ నగ్న వీడియోలను అందరికి పంపుతాం’’ అని లోన్ యాప్ నిర్వాహకులు రమ్యలక్ష్మిని బెదిరించారు. అలాగే దుర్గాప్రసాద్ అప్పు తీసుకున్న విషయాన్ని అతని స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి చెప్పారు. 

 లోన్ తీర్చే మార్గం లేకపోవడం, బంధువుల వద్ద పరువుపోయిందని భావించిన దుర్గాప్రసాద్ దంపతులు తీవ్ర మనస్తాపం చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. పిల్లలను ఇంటి వద్దే వదిలేసి.. రాజమండ్రిలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగారు. తాము లాడ్జీలో పురుగుల మందు తాగిన విషయాన్ని బంధువులకు పోన్ చేసి చెప్పారు.  వెంటనే వారు లాడ్జీకి వెళ్లి పురుగుల మందు తాగిన దంపతులను  ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మరణించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

చలించిన సీఎం జగన్..
రాజమహేంద్రవరంలో దంపతుల ఆత్మహత్య ఘటనపై సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ దంపతుల మృతితో అనాథలుగా మారిన వారి ఇద్దరు పిల్లలకు సాయం అందించాలని ఆదేశించారు. ఇద్దరు చిన్నారులకు చెరో రూ. 5 లక్షల సాయం అందజేయానలి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.

 

click me!