
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని జనసేన (janasena) నాయకుడు నాదెండ్ల మనోహర్ రెడ్డి (nadendla manohar reddy) ఆరోపించారు. శుక్రవారం ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి (cm jagan mohan reddy) మంచి పాలన అందిస్తారనుకుంటే.. దానికి భిన్నంగా విచిత్రమైన వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై కపటవైఖరితో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనేక మంది సలహాదారులను నియమించుకొందని నాదెండ్ల మనోహర్ రెడ్డి అన్నారు. అయినా సమస్యలు పరిష్కారం మాత్రం అవడం లేదని తెలిపారు. సర్వశాఖల సలహాదారుడికి ఉద్యోగుల, రైతుల సమస్యలు అర్దం కావటం లేదని దుయ్యబట్టారు. రైతులు యూరియా కోసం సతమతమవుతున్నారని మరి అలాంటప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారని ఆయన ప్రశ్నించారు.
సినీ ప్రముఖలకిచ్చిన సమయం, వారిపై చూపిన శ్రద్ధ సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులపై చూపడం లేదని నాదెండ్ల మనోహర్ రెడ్డి అన్నారు. అసలు వారిని పట్టించుకోవడమే లేదని చెప్పారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోలను తప్ప ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్లను చర్చలకు ఆహ్వానించకుండా వివక్ష చూపారని తెలిపారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం, నిరుద్యోగ, ఇసుక సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించడమే లేదని అన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధిలో వందల కోట్ల స్కాం జరిగిందని నాదెండ్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంతో పోరాడి రాష్టానికి రావాల్సిన నిధులను తీసుకురావడం లేదని విమర్శించారు. వైఎస్ ఆర్ సీపీ అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు అవుతుందని అన్నారు. అయినప్పటికీ ఇంత వరకు కీలక అంశాలపై ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు.