ఏపీలో రానున్న 100రోజుల్లో 1.28 లక్షల ఇళ్ల నిర్మాణం.. మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉందేమో చెక్ చేసుకోండి?

By Galam Venkata Rao  |  First Published Jul 4, 2024, 12:27 AM IST

‘‘ఇకపై ప్రతినెలా గృహ నిర్మాణాల ప్రగతిని అధికారులతో సమీక్షిస్తాం. రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉంది. ఆదిశగా అన్ని చర్యలు తీసుకోవాలి’’ అని గృహ నిర్మాణ శాఖ అధికారులను మంత్రి పార్థసారథి ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్‌లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మూడు మాసాల్లో లక్షా 28వేల గృహాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై అన్ని జిల్లాల ప్రాజెక్టు డైరెక్టర్‌లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని ప్రభుత్వ శాఖలు 100 రోజుల కార్యాచరణను రూపొందించుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 100 రోజుల కార్యాచరణ కింద రానున్న మూడు మాసాల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పునరుద్ఘాటించారు. ఇందుకుగాను రూ.2,520 కోట్లు ఖర్చు తెలిపారు.

అలాగే, రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 8.02 లక్షల గృహాలను వచ్చే మార్చి నెలాఖరుకు నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు మంత్రి పార్థసారథి చెప్పారు. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్న 6.08 లక్షల గృహాల స్టేజ్ కన్వర్సన్ చేయనున్నట్లు వెల్లడించారు. గృహ నిర్మాణాలు జరిగే లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాయలసీమల్లోని థర్మల్ పవర్ స్టేషన్ల నుంచి వచ్చే ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా ఆప్సన్-3 కింద నిర్మాణంలో ఉన్న గృహాలకు సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రితో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. 

Latest Videos

అదేవిధంగా, రాష్ట్రంలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న గృహాలను వేగవంతంగా పూర్తి చెయ్యటానికి అధికారులందరూ కృషి చేయాలని ఆదేశించామని మంత్రి పార్థసారథి చెప్పారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా రీకన్సిలేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. 

అంతేగాక ఇకపై ప్రతినెలా గృహ నిర్మాణాల ప్రగతిని అధికారులతో సమీక్షిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని.. ఆదిశగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందని... నిర్మాణాలను వేగవతంగా పూర్తి చేసేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. 

ఈ సమీక్షలో ముఖ్యంగా 2015లో ప్రారంభమైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, (అర్బన్) పథకం క్రింద జిల్లాల్లో గృహ నిర్మాణాల ప్రగతిని, రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాల వంద రోజుల ప్రణాళికపై నియోజక వర్గాల వారీగా మంత్రి పార్థసారథి సమీక్షించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖలో ఉన్న ఖాళీలను ప్రస్తావిస్తూ పదోన్నతుల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని, కిందిస్థాయి ఖాళీలను జిల్లాల నుంచి లేదా డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. గృహ నిర్మాణ పథకాల అమలుకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని మంత్రి పార్థసారథి అధికారులకు స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో 100 రోజుల ప్రణాళికలో లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలు పూర్తయితే.. లక్షలాది మంది పేదలకు సొంతింటి కల సాకారం అవుతుంది. అద్దె బారం తప్పుతుంది. కాగా, గతంలో టిడ్కో ఇళ్లకు పేదలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని రూ.లక్షలు చెల్లించి ఉన్నారు. వారికి ఇళ్లు కేటాయించకుండానే... బ్యాంకులు రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల చేతికి ఇళ్ల తాళాలు వస్తే ఇక పండగే... 

click me!