మహిళల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఏపీ రాష్ట్ర హోం మంత్రి సుచరిత చెప్పారు. దళితులపైత చంద్రబాబు సహా టీడీపీ నేతలు ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చోటు చేసుకొన్న ఘటనలను ఆమె ప్రస్తావించారు.
అమరావతి:మహిళల రక్షణే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మంగళవారం నాడుఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రమ్య హత్య ఘటన విషయంలో టీడీపీ నేత నారా లోకేష్ వ్యవహరించిన తీరును ఆమె తప్పు పట్టారు. ఇంటికి వెళ్లి పరామర్శించడానికి బదులు ఆస్పత్రికి వచ్చి అనవసరమైన రాద్ధాంతం చేశారని ఆమె అన్నారు.
దిశ చట్టం వచ్చిన తర్వాత 1647 కసులు నమోదు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అంతేకాదు ఏడురోజుల్లోనే ఈ కేసుల్లో చార్జీషీట్ దాఖలు చేశామన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా దిశ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.
.గుంటూరులో బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య ఘటనలో నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. రమ్యను హత్య చేసిన నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేసినట్టుగా హోంమంత్రి సుచరిత చెప్పారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. కాల్‌మనీ బాధితులను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్య తీసుకోలేదని మంత్రి సుచరిత విమర్శించారు.
39 లక్షల మంది మహిళలు దిశయాప్ ను డౌన్ లోడ్ చేసుకొన్నారని మంత్రి తెలిపారు. దిశ యాప్‌నకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. దళితులపై దాడులు గత రెండేళ్లబో భారీగా తగ్గాయని హోంమంత్రి తెలిపారు. జగన్ పాలనలో దళితులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారని ఆమె చెప్పారు.