ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలనే తమ ప్రభుత్వం కోరుకొంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
అమరావతి:ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలనే తమ ప్రభుత్వం కోరుకొంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.గురువారం నాడు ఆయన అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి తెలంగాణ నేతల వ్యాఖ్యల గురించి ఆయన స్పందించారు.
గతంలో జగన్, కేసీఆర్ సమావేశాలు జరిగిన సందర్భంలో ఒక్క సమావేశానికి తాను హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు. రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు ఎంతవరకైనా ముందు ఉంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టునుండి తక్కువ వ్యవధిలో తమ రాష్ట్రానికి కేటాయింపులకు అనుగుణంగానే నీటిని వాడుకొనేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిపాదించినట్టుగా సజ్జల గుర్తు చేశారు.
undefined
also read:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమే: వేముల ప్రశాంత్ రెడ్డి
కృష్ణా నది నుండి అదనంగా ఒక్క చుక్క నీటిని కూడ ఉపయోగించుకోవడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర హక్కును కాపాడుకోవడం కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ విషయమై తెలంగాణ ప్రాంత నేతలు ఏం మాట్లాడినా కూడ వారి విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. తెలంగాణ నేతల కంటే ఎక్కువే మాట్లాడే అవకాశం ఉందన్నారు. అలా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అలా అని చెప్పి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఘర్షణ వాతావరణం కాకుండా స్నేహపూరిత వాతావరణం కోరుకొంటున్నామన్నారు. సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని తమ ప్రభుత్వం కోరుకొంటుందన్నారు.