ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఏపీపై తెలంగాణ సీఎం ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు.
అమరావతి: కృష్ణా జలాల విషయంలో దాదాగిరి చేస్తోంది ఎవరో ప్రపంచమంతా గమనిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.కృష్ణా జలాలపై ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం నాడు ఆయన అమరావతిలో స్పందించారు. కరెంటు ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారం నీరు వృధా చేసే దాదాగిరి ఎగువ రాష్ట్రంలో జరిగిందని ఆయన గుర్తు చేశారు.కరెంట్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ , కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ చెప్పినా కూడ వినలేదన్నారు.
also read:కృష్ణా జలాలపై ఏపీ దాదాగిరి: హలియా సభలో కేసీఆర్ సంచలనం
కృష్ణా నదికి వరదల సమయంలో ఎక్కువ నీటిని తరలించేందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి సీఎంజగన్ ప్రయత్నించారని ఆయన చెప్పారు. దాదాగిరి, దౌర్జన్యాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే మన ప్రయత్నమన్నారు.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఉమ్మడి .ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది