ప్రజలు కోరుకొన్నట్టుగానే పాలన సాగించినందున ఏలూరులో వైసీపీకి ఏకపక్షంగా తీర్పు లభించిందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడ ఇదే రకమైన ఫలితాలు వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.
అమరావతి: ప్రజలు మెచ్చేరీతిలో పాలన అందిస్తున్నందునే ఏలూరులో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.సోమవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో తమకు 56.3 శాతం,టీడీపీకి 28.2 శాతం ఓట్లు దక్కాయన్నారు.
సీఎం జగన్ పాలనను ప్రజలు ఆశీర్వదించారని ఆయన చెప్పారు. ఏలూరులో జనమంతా ఒకే మాటగా వైఎస్‌ఆర్‌సీపీకి ఓటేశారన్నారు.రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లను వైసీపీ దక్కించుకొందన్నారు. ఏంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడ ఇవే ఫలితాలు వస్తాయని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.అమరావతిలోని కరకట్ట వద్ద చంద్రబాబునాయుడు నివాసం ఉన్న సమయంలో కూడ ఆయన కరకట్టను వెడల్పు చేయలేదని విమర్శించారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కరకట్ట వెడల్పు చేసే పనులు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల్లో వైసీపీకి 47 డివిజన్లు దక్కాయి. టీడీపీకి మూడు డివిజన్లు దక్కాయి. ఈ ఏడాది మార్చి 10వ తేదీన ఈ కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగాయి. కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపును ఆదివారం నాడు నిర్వహించారు అధికారులు.