కేంద్ర బడ్జెట్ 2020పై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జీఎస్టీ కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై స్పష్టంగా చెప్పలేదన్నారు
కేంద్ర బడ్జెట్ 2020పై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జీఎస్టీ కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై స్పష్టంగా చెప్పలేదన్నారు. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రానికి రీయంబర్స్ చేయాల్సిన మొత్తాన్ని చేయలేదని బుగ్గన తెలిపారు.
దేశ స్థూల ఉత్పత్తిలో 10 శాతం పెరుగుదలతో బడ్జెట్ ప్రవేశపెట్టారని.. 10 శాతం పెరుగుదల సాధ్యమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారని, కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా రాలేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
Also Read:జగన్ వల్లే ఏపీకి సున్నా.. కేంద్ర బడ్జెట్ పై యనమల కామెంట్స్
దేశ ఆర్ధిక వ్యవస్థ మందగమనంలో ఉందని.. వ్యవసాయరంగానికి గోదాములు పెంచాలనేది మంచి పరిణామమని ఆర్థిక మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు ముద్ర రుణాలు, ఆయుష్మాన్ భారత్, వ్యాపార వృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, కృషి ఉడాన్, కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణం ఆహ్వానించదగ్గవని బుగ్గన ప్రశంసించారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర హక్కని, హోదాపై ఎటువంటి హామీ రావడం లేదని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
విభజన జరిగినప్పుడు రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉందని, వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్ ఇస్తామన్నారని కానీ పాత బకాయిలే ఇప్పటి వరకు విడుదల కాలేదని మంత్రి గుర్తుచేశారు. ఆర్ధిక రంగం కుదేలవుతున్న సమయంలో స్థూల ఉత్పత్తిలో పది శాతం అభివృద్ధి అనుమానంగా ఉందని బుగ్గన అభిప్రాయపడ్డారు.
ఏపీ పన్ను వాటా తగ్గడం ఇబ్బందికర పరిణామామని, బడ్జెట్‌లో రైతులకు, కొన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని బుగ్గన తెలిపారు. ప్రతిపక్షం తీరు రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఉందన్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి విభజన హామీలు రాబట్టాల్సిన సమయంలో చంద్రబాబు నీరుగార్చారని బుగ్గన ఆరోపించారు.
Also Read:ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు
పర్సంటేజ్‌ల కోసం కక్కుర్తిపడి బాబు ప్యాకేజీలకు ఓకే చెప్పారని ఆయన మండిపడ్డారు. విషయం వేడిగా ఉన్నప్పుడే టీడీపీ చేతులేత్తేయడంతో మళ్లీ మొదటి నుంచి చక్కబెట్టడానికి తమ ప్రభుత్వానికి టైం పడుతుందని రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
అధికారం చేపట్టిన రెండేళ్ల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ను ఎందుకు చేపట్టలేదని ఆయన చంద్రబాబును నిలదీశారు. పట్టిసీమలో రూ.600 కోట్ల అవినీతికి పాల్పడేందుకు పోలవరంను పక్కనబెట్టారని బుగ్గన తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా ఆపలేదని, కొన్ని నిర్మాణాలను మాత్రమే తాము పక్కనబెట్టామని మంత్రి వెల్లడించారు. సీఆర్‌డీఏ పరిధిలోని భూములపై ప్రాథమిక విచారణలోనే 4 వేల ఎకరాల భూముల్లో అవనీతి జరిగిందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.