ఏపీలో పోలవరం రగడ: నిర్మలతో బుగ్గన భేటీ.. చర్చించిన అంశాలివే

By Siva KodatiFirst Published Nov 6, 2020, 7:21 PM IST
Highlights

పోలవరం అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు

పోలవరం అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పోలవరం నిధులు, సవరించిన అంచనాల ఆమోదం, ఆర్ధిక సాయంపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని విషయాలు వివరించానన్నారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపే అంశాన్ని పరిశీలిస్తామని నిర్మల హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. 

ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్లలో 2,234 కోట్లకు ఇటీవల కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. 2013-14 అంచనాలకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని.. కానీ నాటి అంచనాల కంటే భూసేకరణకే 17 వేల కోట్లు అదనం ఖర్చు అవుతుందని రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

భూసేకరణలో 2005-2006 అంచనాలనే 2013-14 అంచనాల్లో పొందుపరిచారని.. 2013-14 అంచనాల ప్రకారం  అయితే ఇబ్బంది అవుతుందని తాము కేంద్రమంత్రికి దృష్టికి తీసుకొచ్చామని ఆయన వివరించారు.

సవరించిన అంచనాలు- 1, 2, సహా సవరించిన అంచనా కమిటీ నివేదికలు కేంద్రానికి ఇచ్చామని.. వాటిని సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. 

click me!