ఫైబర్ గ్రిడ్: టివిల్లో జగన్ బొమ్మ కనబడేది డౌటే ?

First Published Dec 27, 2017, 12:00 PM IST
Highlights
  • వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాల బొమ్మ కానీ గొంతు కానీ  రాష్ట్రంలో ఎక్కడా కనబడదా?

వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాల బొమ్మ కానీ గొంతు కానీ  రాష్ట్రంలో ఎక్కడా కనబడదా? చంద్రబాబునాయుడు వేసిన మాస్టర్ ప్లాన్ గనుక అమలైతే నిజంగానే అంతపనీ జరుగుతుందా? ప్రతిపక్షాలకు అంటే ప్రధానంగా వైసిపికి గానీ పార్టీ అధ్యక్షుడు జగన్ కు గానీ ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య ఏంటి? అంటే సమస్య వస్తుందనే అందరూ అనుమానిస్తున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రభుత్వం రూపొందించిన పైబర్ గ్రిడ్ పథకం బుధవారం ప్రారంభమైంది. చంద్రబాబు ప్లాన్ ప్రకారం రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకు ఫైబర్ గ్రిడ్ ఫలాలు అందాలి.  ఒకే కేబుల్ ద్వారా చౌకగా టెలిఫోన్ కేబుల్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇక్కడే వైసిపిలో ఆందోళన మొదలైంది.

ఒకసారంటూ కేబుల్ వ్యవస్ధ గనుక ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతే ప్రతిపక్షాల గొంతు ప్రజలకు వినబడదని. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకున్న ఏ ఇంట్లో టివి ఆన్ చేసినా ప్రభుత్వ పథకాలు, చంద్రబాబునాయుడు మొహం, అధికార తెలుగుదేశంపార్టీ కార్యక్రమాలు తప్ప ఇంకోటి కనబడే అవకాశాలు దాదాపు ఉండవనే చెప్పాలి.

ఇప్పటికే కేబుల్ ప్రసారాలపై ప్రభుత్వం అనధికార నిషేధాన్ని అప్పుడప్పుడు విధిస్తున్న విషయం తెలిసిందే. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ను అరెస్టు చేసినపుడు అరెస్టు దృశ్యాలు, అప్పుడు జరిగిన గొడవలు బయట ప్రపంచానికి తెలీకుండా ప్రభుత్వం ప్రసారాలను నిలిపేయించింది.

అలాగే, టిడిపి ఎంఎల్ఏల హవా ఉన్న పలు నియోజకవర్గాల్లో సాక్షి టివి ప్రసారాలను అడ్డుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. స్ధానికి కేబుల్ ఆపరేటర్లను ప్రలోభాలకు గురిచేసో లేక ఒత్తిడి పెట్టో వైసిపి కార్యక్రమాలను నిలిపేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. పై వ్యవహారాలన్నీ పూర్తిగా అనధికారికంగానే జరుగుతున్నాయి.

ఒకవేళ ప్రభుత్వమే ఫైబర్ గ్రిడ్ పేరుతో అధికారికంగా కేబుల్ వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకుంటే ప్రతిపక్షాల గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. అందులోనూ 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందుకనే చంద్రబాబు కూడా ఫైబర్ గ్రిడ్ పథకాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికి 1.04 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే మార్చి నాటికి 10 లక్షల కుటుంబాలకు కనెక్షన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

చంద్రబాబు జోరు చూస్తుంటే వచ్చే ఏడాదిలోగా 1.45 కోట్ల కుటుంబాలకూ కనెక్షన్లు ఇచ్చేసేలా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఫైబర్ గ్రిడ్ తీసుకోవటానికి నిరకరిస్తే అటువంటి వారికి మామూలు కేబుల్ కనెక్షన్ అందకుండా చేయటం పెద్ద కష్టం కాదు. అందుకనే చంద్రబాబు ప్లాన్ ను అడ్డుకోవాలనే వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసారు. కోర్టు కూడా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మరి, ఆకేసు ఏమవుతుందో చూడాలి.

 

 

click me!