
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారంతా చంద్రబాబు కోవర్టులేనని ఆయన వ్యాఖ్యానించారు. ముందు నుంచి చంద్రబాబుతో వారు టచ్‌లో వున్నారని.. వైసీపీ ఒక్కటే కాకుండా బీజేపీ, కాంగ్రెస్‌లోనూ టీడీపీ అధినేతకు కోవర్టులు వున్నారని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో వున్న బాబు మనుషులు ఏం చేస్తారోనని భయంగా వుందని, అందుకే నమ్మకస్తులకే జగన్ పట్టం కడుతున్నారని , ఎవరినీ నమ్మకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
టీడీపీలో వున్న కొందరు ఎస్సీలు వైసీపీలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు వారికి డబ్బులు ఇస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని, టీడీపీ నుంచి వచ్చిన వారిని తీసుకోవద్దని జగన్‌ను కాళ్లు పట్టుకుని బతిమలాడానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును షర్మిల కలవడంపైనా నారాయణ స్వామి స్పందించారు. అది షర్మిల విచక్షణకే వదిలేస్తున్నానని.. వైఎస్ మరణానికి చంద్రబాబు, సోనియాలే కారణమన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. తనతో పాటు ప్రజలందరిదీ అదే మాట అని , మరి అందరిపైనా కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.
కాగా.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఏపీలో వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణంపై సోనియాని దోషిగా చిత్రీకరిస్తూ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు. అలాగే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి మరింత రెచ్చిపోయారు. సోనియా, చంద్రబాబు కలిసి వైఎస్ఆర్‌ని హెలికాఫ్టర్ ప్రమాదంలో చంపారనే సందేహం ప్రజల్లో వుందని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తిని సోనియాతో కలిసి బాబు హింసించారని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పూ చేయని జగన్‌ని అక్రమ కేసుల్లో ఇరికించారని, 16 నెలలు జైల్లో పెట్టి హింసించారని చెప్పారు. అప్పుడు స్పందించని కాంగ్రెస్ నేతలు, ఇప్పుడెందుకు తనపై కేసు పెట్టారంటూ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.